కరోనా తీవ్రతకు అసలు కారణం ఏమిటో తెలుసా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విపరీతంగా పెరిగిపోవటానికి వైద్యులు, వైద్య నిపుణులు ప్రధాన కారణాన్ని వివరించారు. వాళ్ళు చెప్పినదాని ప్రకారం కరోనా ఉదృతికి ప్రధాన కారణం యువతేనట. అవునే అంగీకరించటానికి కష్టంగా ఉన్నా అసలు వాస్తవం మాత్రం ఇదేనట. ఎందుకంటే యువతలో ఇమ్యునిటి పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్దగా లెక్కచేయరు.

చిన్న చిన్న సమస్యలను యువత ఎందుకు లెక్కచేయదంటే ఒకటిరెండు రోజులుండి అవే పోతాయన్న ధైర్యం, నిర్లక్ష్యం. ధైర్యం సంగతి ఏమోకానీ నిర్లక్ష్యమే ఇపుడు కరోనా సెకెండ్ వేవ్ ఉదృతికి కారణం అవుతోందట. యువతకి కరోనా వైరస్ సోకినా అంత తొందరగా లక్షణాలు బయటపడవు. అసలు తమకు కరోనా వైరస్ సోకిన విషయం కూడా యువకులకు తెలీటంలేదు. దాంతో యువత ఎక్కడెక్కడో స్వేచ్చగా తిరిగేస్తున్నారు. యువతలో జాగ్రత్తలు తీసుకునే వాళ్ళున్నట్లే, నిర్లక్ష్యంగా ఉండేవారు కూడా ఉన్నారు.

జాగ్రత్తలు తీసుకున్నా, నిర్లక్ష్యంగా ఉన్నా బయట తిరిగేస్తున్న యువత వల్ల చాలామందికి వైరస్ అంటుకుంటోందట. వైరస్ సోకిన యువత కొద్దిరోజులు బాగానే ఉంటున్నారు. వైరస్ అంటుకున్న యువతా బాగానే ఉన్నారు. ఎటొచ్చి మధ్యలో మధ్యవయస్సు, వృద్ధులు, చిన్నపిల్లల్లోనే వైరస్ ప్రభావం వెంటనే చూపిస్తోంది. దీని ఫలితంగానే మధ్య వయస్సు, వృద్ధుల్లో అప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా ఉంటే అంతే సంగతులు.

అప్పటికే అనారోగ్య సమస్యలున్నవారిపై కరోనా వైరస్ రెచ్చిపోతోంది. దీని కారణంగా వాళ్ళపై తీవ్ర ప్రభావం పడుతోంది. దానికితోడు రెండు, మూడు రోజులు ఇంట్లోనే వైద్యం చేయంచుకుని సమస్య ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఆసుపత్రులకు పరిగెడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. చివరి నిముషంలో ఆసుపత్రుల కారణంగా ఎవరు ఏమీ చేయలేకపోతున్నట్లు డాక్టర్లు నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు.

అందుకనే డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే జ్వరం, ఒళ్ళునొప్పుల్లాంటి లక్షణాలు బయటపడగానే వెంటనే ఆసుపత్రులకు వెళ్ళాలట. కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. యువత కూడా అవసరం లేకపోతే బయటకు వెళ్ళకూడదని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలుండే ఇళ్ళల్లోని వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎంతమంది వీళ్ళ హెచ్చరికలను పాటిస్తారు ?