ఏమిటీ ప్రోనింగ్.. దాన్నెలా చేయాలి? ఎప్పుడు చేయకూడదు?


కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. భారీ కొరతను ఎదుర్కొంటున్న అంశాల్లో ముఖ్యమైనది ఆక్సిజన్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దీని కొరత కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క.. ప్రాణాలు విడుస్తున్న వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇలాంటి వాటిని ఎక్కువగా మనసుకు తీసుకుంటే.. కొత్త సమస్యలు మీద పడటం ఖాయం. కరోనా వైరస్ రోగి శరీరంలోకి చేరి శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా కొత్త సమస్యలకు కారణమవుతోంది.


ఇలాంటివేళ.. కొందరు కరోనా భయంతోనే చనిపోతున్న దుస్థితి ఉంది. మహమ్మారి భయంతో శ్వాస తీసుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కొందరు తీవ్ర అవస్థలకు గరవుతున్నారు. ఇలాంటి వేళ.. ప్రోనింగ్ పద్దతిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునే వీలుందన్న మాట పలువురు చెబుతున్నారు.


ప్రోనింగ్ పద్దతిని పక్కాగా ఫాలో కావటంతో పన్నెండు రోజుల్లో కరోనా నుంచి బయటపడొచ్చన్న నిపుణుల మాట ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోనింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఆ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏమేం చేయకూడదన్న విషయాల్లోకి వెళితే..


ఇంతకీ ప్రోనింగ్ ఏమిటన్నది చూస్తే.. ఛాతి.. పొట్టభాగంపై బరువు పడేలా బోర్లా పడుకోవటం లేదంటే.. ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవటంతో ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ చేరుతుందని చెబుతున్నారు. ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగులకు ప్రోనింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే..

 • మొదట బోర్లా పడుకోవాలి
 • మెత్తటి దిండు తీసుకొని మెడ కింద భాగంలో ఉంచాలి
 • ఛాతి నుంచి తొడ వరకు ఒకటి లేదంటే రెండు దిండ్లను ఉంచొచ్చు
 • మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి.
 • రోజంతా ఒకే విధంగా కాకుండా వివిధ భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చు.
  ప్రోనింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు
 • ప్రోనింగ్ పొజిషన్ కారణంగా శ్వాస సరళతరం అవుతుంది
 • ఆక్సిజన్ స్థాయిలు 94 కంటే తక్కువగా పడిపోతే ఈ విధానాన్ని చేయొచ్చు
 • వెంటిలేషన్.. సకాలంలో ప్రోనింగ్ చేయటంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకునే వీలుంది
  తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 • భోజనం తర్వాత గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు
 • సౌకర్యవంతంగా అనిపించే వరకే చేయాలి
 • గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయొచ్చు
 • గుండె జబ్బులు ఉన్న వారు.. గర్భిణిలు.. వెన్నుముక సమస్యలున్న వారు చేయొద్దు
 • ప్రోనింగ్ వేళ దిండ్లును ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)