ఎంత చెప్పినా వినకుండా ఉండటం.. నెత్తి మీదకు వచ్చిన తర్వాత భోరుమంటూ శోకాలు పెట్టటం చాలామంది చేస్తున్నారు. కరోనా కాలంలో ఎలాంటి తప్పులు చేయకూడదో అలాంటి తప్పులే చేస్తున్నోళ్లు లక్షలాది మంది ఉంటున్నారు. నిజానికి ఇలాంటి వారి వల్ల కూడా కరోనా వ్యాప్తి పెరుగుతుందే కానీ తగ్గని దుస్థితి. ఇలాంటి వారి విషయంలో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న హైకోర్టు ఏ రీతిలో అయితే.. ఆక్సిజన్ లారీల్ని ఆపితే.. ఊరి తీయాలన్న రీతిలోనే.. కరోనా వ్యాప్తికి కారణమైన వారి విషయంలో తీవ్రమైన క్రిమినల్ నేరానికి పాల్పడినట్లుగా ట్రీట్ చేస్తే తప్పించి.. ఎవరికి వారు బాధ్యతగా ఉండరేమో అన్న భావన కలుగక మానదు.
తాజాగా జలంధర్ లో ఒక వివాహ వేడుకకు సంబంధించిన రిసెప్షన్ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున అతిధులు హాజరు కావటం షాకింగ్ గా మారింది. ఓపక్క కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉన్న వేళలో అతిధులు పెద్ద ఎత్తున రావటం హాట్ టాపిక్ గా మారింది. అక్కడున్న నిబంధనల ప్రకారం వివాహాది శుభకార్యాలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంది. అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున అతిధులు హాజరయ్యారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వేడుక జరుగుతున్న చోటుకు వెళ్లి.. పెళ్లి కొడుకును.. అతడి తండ్రిని అరెస్టు చేశారు. ఈ వేడుక నిర్వహణకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెళ్లి కొడుకు.. అతడి తండ్రి మీదా ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిజానికి ఇలాంటి వార్తల్ని బ్రేకింగ్ న్యూస్ లుగా.. దినపత్రికల్లో హెడ్ లైన్స్ లో వేస్తే తప్పించి.. మిగిలిన వారు బుద్ధి తెచ్చుకొని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారని చెప్పక తప్పదు. ఈ ఇష్యూలో అసలుసిసలు ట్విస్టు ఏమంటే.. తమ రిసెప్షన్ కు అంతమంది అతిధులు ఎలా వచ్చారో తమకు అర్థం కావటం లేదని వాపోతున్నాడు. వేడుక ఏమో కానీ.. చివరకు జైలు వరకు వెళ్లటం మాత్రం ఎంతో మందిని జాగ్రత్త పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.