వైర‌ల్ వీడియో.. రైల్వే ట్రాక్‌పై అద్భుతం


నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాను ఒక మీడియా ముంచెత్తుతోంది. ఒక రైల్వే స్టేష‌న్లో అవ‌త‌లి నుంచి రైలు దూసుకొస్తుండ‌గా.. ట్రాక్ మీద ప‌డ్డ పిల్లాడిని ఆ స్టేష‌న్లో విధులు నిర్వ‌ర్తించే పాయింట్స్ మ్యాన్ క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ప్రాణాల‌కు తెగించిన తీరు అబ్బుర ప‌రుస్తోంది ఈ వీడియోలో. ముంబ‌యిలోని వాంగ‌ని రైల్వే స్టేష‌న్లో చోటు చేసుకుంది. మ‌యూర్ షేల్కే అనే పాయింట్స్ మ్యాన్ అసాధార‌ణ సాహ‌సంతో హీరో అయ్యాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

వాంగ‌ని రైల్వే స్టేష‌న్లో ఓ మ‌హిళ ఓ పిల్లాడిని వెంట బెట్టుకుని ఫ్లాట్ ఫామ్ మీద న‌డుచుకుంటూ వెళ్లింది. దూరం నుంచి ఫ్లాట్ ఫామ్ మీదికి రాబోతున్న ట్రైన్ ఎక్కాల‌నుకున్నారో ఏమో ఆ ఇద్ద‌రూ ఫ్లాట్ ఫామ్ నుంచి ట్రాక్ వైపుగా క‌దులుతూ వెళ్తారు. ఐతే ప‌ట్టుత‌ప్పిన పిల్లాడు కింద ఉన్న ట్రాక్ మీద ప‌డిపోయాడు. పిల్లాడు లేచి పైకి ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించాడు కానీ.. ఆ మ‌హిళ అత‌ణ్ని అందుకోలేక‌పోయింది. ఇంత‌లో అవ‌త‌లి నుంచి ట్రైన్ దూసుకొస్తోంది. ఈలోపు దూరం నుంచి పాయింట్స్ మ్యాన్ శ‌ర‌వేగంతో ప‌రుగెత్తుకొచ్చాడు.

రెప్ప‌పాటు వ్య‌వ‌ధిలో ఆ పిల్లాడిని పైకి పంపి తాను కూడా పైకొచ్చేశాడు. అత‌నిలా పైకొచ్చాడో లేదో.. ట్రైన్ ట్రాక్ మీది నుంచి దూసుకెళ్లింది. క్ష‌ణం ఆల‌స్యం అయినా ఇద్ద‌రి ప్రాణాలు నిలిచేవి కావు. చూస్తుంటే ఒళ్లు గ‌గొర్పుడుస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో నిన్న రాత్రి నుంచి వైర‌ల్ అవుతోంది. మ‌యూర్ మీద స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అత‌డికి రివార్డు ఇవ్వాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో రైల్వే మంత్రి పియూష్ ఘోష‌ల్ దృష్టికి వెళ్లింది. మ‌యూర్‌ను ఆయ‌న కూడా అభినందించారు.