హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అన్న సందేహమే కాదు.. చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలా? అన్న షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా మారుతుంది. పోలీసులు సైతం విస్మయానికి గురైన ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ లోని ఒక కాలనీలో ఎంబీబీఎస్ చదివి అమ్మాయి పక్కింట్లో తొమ్మిది తరగతి చదివే అబ్బాయి ఉన్నాడు. తమ్ముడు వయసున్న చిన్న పిల్లాడే కదా అని ఆమె అతన్ని నమ్మింది. తన ఫోన్ అడిగితే అమాయకంగా ఇచ్చేసింది. ఒకరోజు ఆమె ఫోన్ లో ఆమె మొయిల్ ఐడీ పాస్ వర్డ్ మార్చేశాడు. అక్కడ్నించి ఆమె పేరుతో ఆన్ లైన్ క్లాసుల్లోఅసభ్య సందేశాలు పెట్టటం.. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టటం లాంటివి చేసేవాడు. దీంతో.. ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేది.
తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయని విలవిలలాడేది. తాను ఎదుర్కొంటున్న సమస్యను..దీనంతటికి కారణమైన ఆ పిల్లాడికే అమాయకంగా చెప్పేసేది. ఆ పిల్లాడు సైతం.. ఏవో మాటలు చెప్పేసేవాడు. రోజురోజుకీ టార్చర్ పెరిగిపోవటంతో తట్టుకోలేని ఆ యువతి.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. పిల్లాడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను చేసిన ఎదవ పనిని ఒప్పుకున్నాడు.
ఇతరుల ఫోన్లు తీసుకొని వారి పాస్ వర్డ్ లు మార్చటం.. వేరే సిస్టం నుంచి వారి మొయిల్ ఓపెన్ చేసి.. తప్పుడు మెసేజ్ లు పోస్టు చేయటం తనకు అలవాటుగా ఒప్పుకున్నాడు. దీంతో.. సైబర్ నిబంధనల ప్రకారం ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకొని జువెనైల్ హోమ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పక్కింటి పిల్లాడే అనుకున్న ఆమెకు.. జరిగినదంతా తెలిసి షాక్ కు గురయ్యారు. పిల్లాడని నమ్మితే ఇంత దారుణానికి పాల్పడతాడా? అంటూ విస్మయానికి గురయ్యారు.