ఎంతలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కేసులు పెరగటమే తప్పించి తగ్గే సూచనలు కనిపించని దుస్థితి. దేశంలో నమోదయ్యే కేసుల్లో సింహభాగం మహారాష్ట్రలోనే ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని ముంబయి తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్ననగరాల్లో ఫూణె ఒకటి. దీంతో..వైరస్ వ్యాప్తిని అరికట్టి.. కేసుల తీవ్రతను తగ్గించేందుకు వీలుగా ఫూణె డివిజనల్ కమిషనర్ కీలక ఆదేశాల్నిజారీ చేశారు. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క ఫూణెలోనే 8011 కేసుల్ని గుర్తించారు. దీంతో.. కఠిన చర్యల్ని తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.
రేపటి (శనివారం) నుంచి వారం రోజుల పాటు ఫూణె నగరంలో కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ మూడు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు.. పన్నెండుగంటల పాటు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు చెప్పారు. రానున్న వారంలో బార్ లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు..సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు.
ఫుడ్ డెలివరీలకు మాత్రం అనుమతి ఉంటుందని తేల్చారు. పెళ్లిళ్లు.. అంత్యక్రియలకు మాత్రమే అనుమతి ఉందని.. మిగిలిన ఏ కార్యక్రమాలకు అనుమతులు లేవని తేల్చేశారు. ఆ విషయాల్లోనూ పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు గరిష్ఠంగా 20 మంది.. పెళ్లిళ్లకు 50 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు.
మతపరమైన అన్ని ప్రదేశాల్ని ఏడు రోజులు మూసివేయాలని నిర్ణయించారు. వాస్తవానికి కేసుల తీవ్రత ఎక్కువ అవుతున్న వేళలో.. మహారాష్ట్ర వ్యాప్తంగా రాత్రివేళ కర్ఫ్యూను విధించారు. నాందేడ్.. బీదర్ తో పాటు మరికొన్నిజిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుంది. ఇప్పటివరకు ఈ మహానగరిలో కరోనా పాజిటివ్ కేసులు 5.5 లక్షలకు చేరటం గమనార్హం. మరి.. తాజా పరిమితులు కేసుల వ్యాప్తికి కళ్లాలు వేస్తాయో లేదో చూడాలి.