శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్?


ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం మొదలుకుని.. టీటీడీ వెబ్ సైట్లో తప్పిదాలు, శ్రీవారి భూముల వేలానికి టెండర్, ప్రసాదాల ధరల పెంపు, ఎన్నికల సందర్భంగా లడ్డూల పంపకం లాంటి అనేక అంశాలు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు మరోసారి టీటీడీ పెద్ద వివాదంలో చిక్కుకుంది.

ఇంతకుముందు తలెత్తిన వివాదాలతో పోలిస్తే ఇది కాస్త పెద్దదే. భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపేది. ఇంతకీ విషయం ఏంటంటే.. శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో, నమ్మకంతో సమర్పించే తలనీలాలు స్మగ్లింగ్‌కు గురవుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీనిపై నేషనల్ మీడియాలో వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది.

మిజోరాంలో భారత సైన్యం భారీ ఎత్తున కేశాల రాశులతో వెళ్తున్న వాహనాలను పట్టుకుంది. ఈ వాహనాల్లో పెద్ద పెద్ద మూటల్లో కేశాలను పోగేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ రవాణా చేస్తున్న కేశాల విలువ రూ.2 కోట్లని వెల్లడైంది. విచారణలో భాగంగా ఇవి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలని, టీటీడీ ఆస్తి అయిన వీటిని అక్రమంగా మయన్మార్ ద్వారా చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారని తేలింది. ది హిందూ సహా ప్రధాన పత్రికలు దీన్ని రిపోర్ట్ చేశాయి.

మయన్మార్ సరిహద్దుల్లో సైన్యానికి దొరికి తలనీనాలతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అంతర్జాతీయ టెండర్ల ద్వారా తలనీలాలను అమ్ముతుందని.. కొనుగోలు చేసిన సంస్థ ఆ కేశాలను ఏం చేసుకుంటుందన్నది తమకు సంబంధం లేదని.. తమ వద్ద తలనీలాలుల కొనుగోలు చేసిన సంస్థ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం ఇస్తే సదరు సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని టీటీడీ వివరణ ఇచ్చింది.