ఒక్క ఓడ ఆగిపోతే ప్రపంచానికి ఇంత నష్టమా?

ప్రపంచం కుగ్రామంగా మారిన తర్వాత.. ఎక్కడో ఏదో జరిగినా.. దాని ప్రభావం ప్రపంచం మీద పడే పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఈ విషయాన్ని మరింత బాగా అర్ఱమయ్యేలా చేసింది. ఎక్కడో ఈజిప్టులోని సూయిజ్ కెనాల్ లో షిప్పు అడ్డం తిరిగి.. ఇరుక్కుపోవటం ఏమిటి? దాని కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడటం ఏమిటి? దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరల మీద ఎఫెక్టు పడటం ఏమిటి? యావత్ ప్రపంచం గొలుసు కట్టుగా మారిన ఈ రోజుల్లో ఎక్కడ.. ఏ పూసకు తేడా కొట్టినా దాని ప్రభావం అందరి మీదా పడే దుస్థితి నేడు నెలకొంది.

కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. కెనాల్ లో భారీ షిప్పుడు అడ్డం తిరిగి ఆగిపోవటం.. వెనుక నున్న భారీ షిప్పులు ముందుకు వెళ్లలేక నిలిచిపోయాయి. షిప్పుకు రెండు వైపులా పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో మొత్తం ట్రాఫిక్కు స్తంభించిపోయింది. ప్రపంచ వ్యాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు పదిలక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అయ్యేది ఈ కెనాల్ ద్వారానే.

ప్రస్తుతం షిప్పు ఇరుక్కున్న కారణంగా ప్రతి గంటకు జరుగుతున్న నష్టం రూ.3వేల కోట్లుగా లెక్కేశారు నిపుణులు. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌక.. సూయజ్ నగర సమీపంలోని సూయజ్ కాలువ ముఖ ద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ ఘటన జరిగి 36 గంటలు అయ్యింది. నౌకను తిప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రోజుకు కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం చిన్నా.. పెద్దా అన్ని కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి.

ఈ ఆగిపోయిన చోటే సౌదీ.. రష్యన్.. ఒమన్.. యూఎస్ ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగితే.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల మీద ప్రభావం పడటమే కాదు.. ధరలు పెరిగే ఛాన్సు ఉంది. అదే జరిగితే.. ప్రపంచంలోని ప్రతిమూల ఉన్నోడి మీద కూడా భారం పడే వీలుందని చెబుతున్నారు.