ఎవరీ కావ్యా చోప్రా..

ఎవరీ కావ్యా చోప్రా? ఈ రోజు ఉదయం వరకు ఆమె పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. గురువారం ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆమె పేరు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది. ఇక.. మీడియా గ్రూపుల్లో.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆమె ఫోటో అదే పనిగా వస్తోంది.

బ్రేకింగ్ న్యూస్ లోనూ ఆమె మెరుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఏం సాధించిందని ఇంత బజ్ అంటే.. తాజాగా విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాల్లో జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించటమే. అది కూడా రికార్డు స్థాయిలో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన తొలి మహిళగా ఆమె నిలిచింది.

ఈ నెల 16-18 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మొయిన్స్ పేపర్ 1 పరీక్షకు 6.19లక్షల మంది అప్లై చేస్తే.. 5.90లక్షల మంది రాశారు. 300 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 13 మంది 100 శాతం స్కోర్ ను సాధించారు. 2021లో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన ఆమె.. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా రికార్డును క్రియేట్ చేసింది. ఇదే.. ఆమె వైరల్ కావటానికి కారణంగా చెప్పాలి.

ఆమె సాధించిన మార్కుల నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ లేదంటే ఐఐటీ ముంబయిలో సీటు సాధించే వీలుంది. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేయాలని భావిస్తున్న ఈ టీనేజ్ సంచలనం తాజా విజయంపై ఫుల్ హ్యాపీగా ఉంది. తమ ఇంట్లో తనను.. తన సోదరుడ్ని సమానంగా చూశారే తప్పించి.. అబ్బాయి ఎక్కువ.. అమ్మాయి తక్కువ అన్నట్లు చూడలేదట. దేశంలోని చాలామంది అమ్మాయిలు ఎదుర్కొన్న వివక్షను తానెప్పుడూ ఎదుర్కోలేదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కావ్య.. తాను సాధించిన ఈ ఘనత ఉత్తనే రాలేదని రోజుకు ఏడెనిమిది గంటల కష్టంతో వచ్చినట్లు చెబుతోంది.