బ్రేకింగ్.. భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20లు ఖాళీ స్టేడియంలో

ఇండియాలో లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ద‌శ‌లు వారీగా తొల‌గించేశారు. థియేట‌ర్ల‌లో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ రూల్ తొల‌గిపోయింది. స్టేడియాల్లోకి కూడా అభిమానుల‌ను అనుమ‌తించేస్తున్నారు. 50 శాతం మంది అభిమానుల‌తో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అభిమానుల‌కు అనుమ‌తులు లభించ‌గా.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును మాత్ర‌మే ఖాళీ స్టేడియంలో నిర్వ‌హించారు. త‌ర్వాత నుంచి స్టేడియాలు 50 శాతం ఆక్యుపెన్సీతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

ముఖ్యంగా ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన స్టేడియంగా అవ‌త‌రించిన మొతేరా మైదానంలో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతోనే ఎంతో సంద‌డి నెల‌కొంది. 60 వేల మందికి పైగా వీక్ష‌కుల‌తో స్టేడియం హోరెత్తింది. కానీ భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య మంగ‌ళ‌వారం జ‌రిగే మూడో టీ20 నుంచి మాత్రం స్టేడియంలో నిశ్శ‌బ్దం ఆవ‌హించ‌నుంది.

ఈ మ్యాచ్‌కే కాదు.. మొతేరాలోనే జ‌రిగే చివ‌రి రెండు టీ20ల‌కు కూడా అభిమానుల‌ను అనుమ‌తించ‌ట్లేదు. హ‌ఠాత్తుగా గుజ‌రాత్ క్రికెట్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మ‌దాబాద్‌లో క‌రోనా కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఇలా వేల మందిని స్టేడియాల‌కు అనుమ‌తిస్తే వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుంద‌న్న ఉద్దేశంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఖాళీ స్టేడియంలో నిశ్శ‌బ్దం మ‌ధ్య భార‌త్-ఇంగ్లాండ్ టీ20 చూడ‌టం ఇబ్బందిక‌ర‌మే అయినా ఇది అనివార్య‌మైంది. ఇప్ప‌టికే టికెట్లు కొన్న అభిమానుల‌కు డ‌బ్బులు వాప‌స్ చేయ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో ఆరంభ‌మ‌య్యే ఐపీఎల్‌ను పూర్తిగా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా ఇక త‌మ‌కు అడ్డం రాద‌ని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ.. మ‌ళ్లీ ఇలా ప్ర‌భావం చూపుతుంద‌ని వారు ఊహించి ఉండ‌రు.