పిల్లల ఆసుపత్రికి రూ.300 కోట్లు ఇచ్చిన పెద్ద మనిషి

కోటి కాదు రెండు కోట్లు కాదు. ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి సంచలనంగా మారారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళం ఇవ్వటమే కాదు.. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తన వంతుగా చేసిన సాయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ రూ.300కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిందెవరంటే.. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (చిన్నగా చెప్పుకోవాలంటే యూఐసీ) సంస్థ.

తాజాగా ఈ సంస్థ అధినేత సంజయ్ సింగ్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. రూ.300 కోట్ల విరాళాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన యూఐసీ అధినేత.. తిరుపతిలో చిన్న పిల్లల ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. విభజన వేళ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి.. విజయవాడ.. విశాఖ పట్నాల్లో ఆసుపత్రులు కట్టాలన్న ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని.. తాజాగా యూఐసీ సంస్థ ముందుకొచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తొలి ఆసుపత్రిని శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్మిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోవటం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఈ పిల్లల ఆసుపత్రి ఉండనుంది.