ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ భవనం ఎదుట.. పోలీసు అధికారి ఒకరు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. యూపీ అసెంబ్లీ గేటు నెంబరు ఏడు వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.
యూపీకి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే.. యూపీ అసెంబ్లీ వద్దకు వచ్చారు. అక్కడి ఏడో నెంబరు గేటు వద్ద నిలుచున్న ఆయన.. తన సర్వీసు రివాల్వర్ తో తనను తాను కాల్చేసుకున్నారు. దీంతో.. అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన.. ఘటనాస్థలంలోనే మరణించారు. పెద్ద మోత రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ తిన్నారు.
అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను మరణించిన వైనాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్య చేసుకున్న చోట.. అతను రాసుకున్న సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ‘‘నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగుల్ని చూడండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును షురూ చేశారు. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates