షాకింగ్ పరిణామం బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై రోజులకు కరోనా పాజిటివ్ నమోదైన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త భయాలకు తెర తీసేలా తాజా పరిణామం నెలకొంది. అది కూడా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది వైద్య సిబ్బంది విషయంలో చోటు చేసుకున్న ఈ వైనం.. ఏ మాత్రం మింగుడు పడటం లేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఇలా జరిగింది.
20 రోజుల క్రితం ఎనిమిది మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు కాగా.. ఆరుగురు వైద్య సిబ్బంది. అయితే.. ఈ ఎనిమిది మందిలో ఒకరు తప్పించి మిగిలిన ఏడుగురు ఆపరేషన్ థియేటర్ కు చెందిన వారే. తాజాగా వీరందరికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. ఆరుగురిని కరోనా వార్డులో.. ఇద్దరు హోం ఐసోలేషన్ లో చికిత్స చేస్తున్నారు. ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. అదే సమయంలో 86 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. తాజాగా నమోదైన 149 మంది కరోనాతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.95 లక్షల మందికి పాజిటివ్ రాగా.. 1612 మంది మరణించారు. 2.92లక్షల మంది ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. మొత్తం కేసుల్లో పాతిక మంది గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారు కావటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates