10 వేల జీతం ఇవ్వలేదని 24 కోట్ల నష్టం చేశాడు

తనకు రావాల్సిన రూ.10 వేల జీతం ఇవ్వలేదనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి ఏకంగా రూ.24 కోట్ల నష్టాన్ని చూపించాడు. సూరత్‌లోని శ్యామ్ సంగిని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 9న భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదట ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని భావించినా, పోలీసుల దర్యాప్తులో ఇది కావాలనే చేసిన పని అని తేలింది. ఈ కేసులో 33 ఏళ్ల మాజీ అకౌంటెంట్ వినోద్ సాల్వేను క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. 

వినోద్ అదే మార్కెట్‌లోని ఓ వస్త్ర వ్యాపారి దగ్గర నెలకు రూ.30 వేల జీతానికి అకౌంటెంట్‌గా పనిచేశాడు. పని విషయంలో యజమాని, మరో అకౌంటెంట్ తనను పదేపదే మందలించేవారని అతడు పోలీసులకు చెప్పాడు. ఉద్యోగం మానేసే సమయంలో రూ.10 వేల జీతం రావాల్సి ఉందని, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని ఆరోపించాడు. దీంతో యజమానికి నష్టం కలిగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఘటనకు ముందు రూ.150 పెట్టి పెట్రోల్ కొనుగోలు చేసిన వినోద్, రాత్రి మార్కెట్‌లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. డెలివరీ కోసం షాపుల బయట ఉంచిన చీరలు, ఇతర వస్త్రాల పార్సిళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు చెబుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలు షాపుల్లోని సరుకు కాలిపోయింది. మొత్తం నష్టం సుమారు రూ.24 కోట్లుగా అంచనా వేశారు. 

నిప్పంటించిన తర్వాత వినోద్ బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కుతాననే భయంతో స్వస్థలానికి వెళ్లకుండా భార్య, బిడ్డతో కలిసి రాజస్థాన్, ఆ తర్వాత అయోధ్యకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు పోలీసులు మార్కెట్ పరిసరాల్లోని పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి అతడిని గుర్తించారు. తిరిగి సూరత్‌కు వచ్చిన తర్వాత డిండోలీ ప్రాంతంలో అతడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.