చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ రిపీట్.. గోల్డ్ స్పాట్ గుర్తుందా?

ఒకప్పుడు భారతీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్ స్పాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు 26 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రముఖ ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలని కోకాకోలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పాత ఉత్పత్తిని యథాతథంగా తీసుకురావడం కాకుండా, ప్రస్తుత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొన్ని మార్పులతో పరిచయం చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తక్కువ చక్కెర లేదా చక్కెర రహిత వెర్షన్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

గోల్డ్ స్పాట్‌కు భారతీయ పానీయాల పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర ఉంది. 1952లో పార్లే సంస్థ ఈ ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో విదేశీ బ్రాండ్లతో పోలిస్తే దేశీయ పానీయాలకు మంచి ఆదరణ ఉండేది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఆరెంజ్ రుచి, ఆకర్షణీయమైన ప్రచారంతో గోల్డ్ స్పాట్ వినియోగదారులకు చేరువైంది. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ ఈ బ్రాండ్‌కు మంచి గుర్తింపు లభించింది. ‘ది జింగ్ థింగ్’ అనే క్రేజీ క్యాప్షన్ దీనికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.

1993లో కోకాకోలా పార్లేకు చెందిన శీతల పానీయాల వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో గోల్డ్ స్పాట్‌తో పాటు థమ్స్ అప్ , లిమ్కా , మాజా వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా కోకాకోలా ఆధీనంలోకి వచ్చాయి. అయితే సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఫాంటా ఉండటంతో, ఒకే తరహా ఆరెంజ్ పానీయాల మధ్య అంతర్గత పోటీ ఏర్పడే అవకాశం ఉందని భావించింది. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ బ్రాండ్ మార్కెట్లో అందుబాటులో లేదు.

ఇప్పుడు మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు గోల్డ్ స్పాట్ పునరాగమనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనతో కొంతమంది వినియోగదారులు తక్కువ చక్కెర, షుగర్ ఫ్రీ పానీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మార్పును దృష్టిలో పెట్టుకుని పాత బ్రాండ్‌కు ఆధునిక రూపాన్ని ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే కొత్త వెర్షన్‌లో రుచి, పదార్థాలు, ధర వంటి అంశాలపై సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయాలు ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.

మరోవైపు భారత శీతల పానీయాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది. రిలయన్స్‌కు చెందిన క్యాంపా వంటి బ్రాండ్లు కూడా మార్కెట్‌లో తమ స్థానాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గోల్డ్ స్పాట్‌ను తిరిగి పరిచయం చేయడం కోకాకోలాకు వ్యాపారపరంగా కీలకమైన నిర్ణయం కావచ్చు. అయితే గతంలో ఉన్న ఆదరణను మళ్లీ సంపాదించుకోవాలంటే పాత జ్ఞాపకాలతో పాటు నేటి తరం అంచనాలకు సరిపోయే ఉత్పత్తిని అందించాల్సి ఉంటుంది. గోల్డ్ స్పాట్ పునరాగమనం నిజమైతే, 90’s కిడ్స్‌కు మరోసారి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునే నాస్టాల్జిక్ మూమెంట్‌కు తెరలేచినట్లే.