వరద నీటిలో పెళ్లి బాజాలు

ఒకవైపు కుండపోత వానలు, వరదలు.. ఎటు చూసినా నిండా మునిగిన పంట పొలాలు.. ఇళ్లల్లోకి చేరిన నీళ్లు.. అయినా సరే పెళ్లి బాజాలు మోగాయి. ఆ జంట ఒక్కటైంది. పిలిప్పీన్స్ లో నడుములోతు వరద నీటిలో పెళ్లి చేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 1 వ తేదీన మనీలాకు ఉత్తరాన వున్న బులకాన్ ప్రావిన్స్ లోని హగనోయ్ తీరప్రాంతంలో గల సెయింట్ జాన్ బాప్టిస్ట్ కేథలిక్ చర్చిలో ఈ వివాహం జరిగింది.

నైరుతి రుతుపవనాలు అత్యధిక ప్రభావం చూపడం, వరస అల్పపీడనాలతో తుఫాను విరుచుకొని పడటంతో పిలిప్పీన్స్ లో కొండచరియలు పడిపోయి వరద పోటెత్తింది. దీంతో తీర ప్రాంతాలతో సహా రాజధాని మనీలా నీట మునిగింది. ప్రధాన రహదారులు, రైలు మార్గాలు జలమయం కావడంతో ఎక్కడి వారక్కడ కదలని పరిస్థితి ఏర్పడింది. హగనోయ్ ప్రాంతం నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరింది. అయినా సరే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

హగనోయ్ కు చెందిన లియాన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ గివచికో లకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపొయింది. ఇరువైపులా పెద్దలు పెళ్లి కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే వారు వివాహం చేసుకోవాలనుకున్న చర్చీలోకి వరద నీరు చేరింది. దాంతో వరద తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోమని చర్చీ పెద్దలు సలహా ఇచ్చారు. దానికి ఆ జంట అంగీకరించలేదు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికే వివాహం చేసుకుంటామని పట్టుపట్టారు. చేసేదేమిలేక చర్చీ పెద్దలు తలూపారు.

వరద ప్రభావంతో చర్చీలో కరెంటు లేదు. పెళ్లి చేయడానికి మైక్ పనిచేయలేదు. అయితేనేం బ్లూటూత్ సహాయంతో స్పీకర్ పెట్టి మరీ వ్యాఖ్యం వినిపించారు. పెళ్లి కూతురు గిల్బర్ట్ గివచికో రిక్షాలో చర్చికి చేరుకుంది. పెళ్లి డ్రస్ లో నడిచేందుకు వీలుగా గౌను కింది భాగం కట్ చేసింది. వధువరులిద్దరూ ప్రేమగా చేతిలో చేయేసి నడుచుకుంటూ వేదిక ఎక్కారు. వరద నీటిలో కూడా ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ తతంగం మొత్తం చిత్రీకరించి వీడియో విడుదల చేయడంతో ఈ ఏడాది పాపులర్ పెళ్లిగా రికార్డులకు ఎక్కింది.