కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఛార్జ్‌షీట్‌తో మరో కీలక విషయం బయటపడింది. కేతన్ చనిపోయిన తర్వాత అతడి కుటుంబం ముందు ఎలా ఏడవాలి? మరింత బాధలో ఉన్నట్లు ఎలా కనిపించాలి? పోలీసులకు దొరికితే ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలను సియా గోయల్ చాట్ GPTతో పాటు ఆన్‌లైన్‌లో వెతికినట్లు పుణె రూరల్ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన ఆ తర్వాత హత్య కేసుగా మారింది. కేతన్‌కు కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి, రితేష్ హంగే కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. లేటెస్ట్ గా ఈ కేసులో పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేతన్ కుటుంబ సభ్యులు లోహగడ్‌కు వచ్చిన సమయంలో సియా ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన సియా.. కేతన్ కుటుంబం ముందు దుఃఖంలో ఉన్నట్లు ఎలా కనిపించాలి, బాధను ఎలా వ్యక్తం చేయాలి అనే విషయాలను వెతికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె ఫోన్‌లోని డిజిటల్ ఆధారాలను పరిశీలించినప్పుడు ఈ సెర్చ్‌ల వివరాలు లభించినట్లు పేర్కొన్నారు.
హత్యకు ముందు చేసిన సెర్చ్‌లను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో పాటు లోనావాలా ప్రాంతంలో గతంలో లోయల్లో పడి చనిపోయిన ఘటనల గురించి సియా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. విషప్రయోగానికి సంబంధించిన మార్గాలను కూడా వెతికినట్లు పోలీసుల ఆరోపణ. ఈ వివరాలను సియా, చేతన్, రితేష్ సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నట్లు దర్యాప్తులో పేర్కొన్నారు.
మరోవైపు పోలీసులకు పట్టుబడితే ఏం చెప్పాలి, విచారణ సమయంలో భయపడకుండా ఎలా ఉండాలి అనే విషయాలపైనా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో ఉంది. ఈ కేసులో మొబైల్ డేటా, కాల్ రికార్డులు, చాట్స్‌తో పాటు సుమారు 80 నుంచి 85 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates