కామెడీ హారర్ అనే కొత్త జానర్ సృష్టించి, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి డబ్బులు కొల్లగొట్టే విద్యని మొదట కనిపెట్టింది రాఘవేంద్ర లారెన్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముని 2 ( కాంచన ) పేరుతో పరిచయం చేసిన ఈ క్యాటగిరీ ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందో లెక్క చెప్పడం కష్టం. తర్వాత వచ్చిన కాంచన 2 అలియాస్ గంగ, కాంచన 3 ఒకదాన్ని మించి మరొకటి కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. ఒకే కథను మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడనే కామెంట్స్ ఉన్నప్పటికీ లారెన్స్ వాటిని లెక్క చేయడం లేదు.
చాలా కాలంగా కాంచన 4 నిర్మాణంలో ఉంది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలోనే రూపొందుతోంది. ఈసారి చాలా ప్రత్యేకతలున్నాయి. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార ఉంటుందని చెన్నై టాక్. వీళ్ళతో పాటు నోరా ఫతేహి కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకుందట. అంతా బాగానే ఉంది కానీ రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్న కాంచన 4 ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. ఈ ఏడాది రిలీజ్ లేదు.
నయన్, పూజా డేట్ల సమస్య వల్ల షూటింగ్ కంటిన్యూగా జరగడం లేదని యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. లారెన్స్ మార్కెట్ కన్నా కాంచన బ్రాండ్ మీద నమ్మకంతో లెక్కలు ఎంతనేది ఖాతరు చేయడం లేదు. అయితే బిజినెస్ పరంగా క్రేజ్ ఎక్కువగా ఉండటంతో లారెన్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఒకపక్క లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న బెంజ్ షూటింగ్ కూడా అంతకంతా ఆలస్యం కావడం ఫ్యాన్స్ కి అంతు చిక్కడం లేదు.
కోలీవుడ్ వర్గాల ప్రకారం కాంచన 4 కోసం ఇంకో ఎనభై రోజుల దాకా షూట్ పెండింగ్ ఉందట. ఇలా అయితే వచ్చే సంవత్సరం వేసవికి రావడం కూడా కష్టమే. ఎలా తీసినా స్టోరీ పరంగా అయితే మరీ కొత్తదనం ఆశించలేం కానీ ఈసారైనా తను రెగ్యులర్ గా చూపించే హారర్ ఎలిమెంట్స్ కాకుండా ఏదైనా కొత్తగా భయపెట్టాలని అభిమానులు కోరుతున్నారు. అది అత్యాశే అవుతుంది కానీ వేరే దర్శకుడితో చేసిన చంద్రముఖి 2 దారుణంగా విఫలమైన నేపథ్యంలో లారెన్స్ ఈసారి కసిగా ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates