ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు వెళ్లేలోపే అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఆమె వెంటపడ్డాడు. యువతిని పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఎదురైన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖపట్నానికి చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె ఇందిరానగర్‌లోని ఓ పీజీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని బయటకు వచ్చింది. అదే సమయంలో జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డు ఆమెను గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
యువతి క్యాబ్ వద్దకు వెళ్తుండగా రాజ్‌కుమార్ కూడా ఆమె వెనుకే వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపే రాజ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజీలో కనిపించిన వ్యక్తిని రాజ్‌కుమార్‌గా గుర్తించి అతడి కోసం గాలించారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
రాజ్‌కుమార్ గచ్చిబౌలి పరిసర ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలతో పాటు ఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates