మీ టూత్ పేస్టులో నాన్ వెజ్ ఉందా?

మీ పేస్టులో ఉప్పుందా అనే ప్రకటన ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నిజంగా ఉప్పుందో లేదో తెలియదు కానీ వెజ్జా, నాన్ వెజ్జా అనేది మాత్రం తెలియాల్సిందే అంటుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబందించి కంపెనీలకు సీరియస్ గా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిన్నటి వరకు సంగతి వేరు ఇకముందు మాత్రం మనం వాడే వస్తువులలో ఏముందో తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.

సబ్బులు, టూత్ పేస్టులు, షాంపులు, మేకప్ కిట్స్ లు మాంసాహారానికి చెందిన పదార్ధాలు కలిశాయా లేక శాఖాహారానికి చెందిన కంటెంట్ కలిసిందా అనే విషయాన్ని తెలియజేసే గుర్తులను తప్పనిసరిగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలన్న కేంద్రం ఈ మేరకు ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ 2011 లో అవసరమైన మార్పులు చేసింది. దీంతో నాన్ వెజ్ ఉత్పత్తులపై గ్రీన్ కలర్, వెజ్ ఉత్పత్తులపై రెడ్ కలర్, బ్రౌన్ కలర్ గుర్తులను ప్యాకేజీలపై ముద్రించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు కంపెనీలు రకరకాల కంటెంట్ కలిపి విక్రయించడం జరుగుతుంది. వివిధ రకాల జంతువుల కొవ్వులను కలిపిన మేకప్ వస్తువులు, టూత్ పేస్ట్ లు విక్రయించేవారు. మత విశ్వాసాలను ఖచ్చితంగా పాటించేవారికి ఇది ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఆ ఇబ్బంది తొలిగిపోతుంది. ఎవరికి ఇష్టమైన వాటిని వారు ఉపగించుకునే సౌలభ్యం ఉంటుంది.

అందుకే ప్రభుత్వం నిర్దేశించిన రంగుల మార్కులను వినియోగదారులకు కనిపించే విధంగా ముద్రించడం తప్పనిసరి చేసింది. దీంతో రోజువారీగా ఉపయోగించే సంరక్షణ వస్తువుల్లో ఏమేమి రసాయనాలను, జంతు ఆధారిత పదార్దాలను కలిపి తయారు చేశారన్న లిస్టు ప్రత్యేకంగా చదివి చూడాల్సిన అవసరం లేకుండా ప్యాకెట్ మీద వున్న కలర్ కోడింగ్ గుర్తు ద్వారా సులువుగా గుర్తు పట్టే వీలుంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి సానుకులత లభిస్తుంది.