నాని సత్తాకు అసలు పరీక్ష మొదలయ్యింది

రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారి ఇంత అడ్వాన్స్ బుకింగ్ దక్కించుకోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ట్రైలర్ లేకుండానే ఈ స్థాయిలో హైప్ రావడం చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ ఏ యాప్ ఓపెన్ చేసినా నిన్న రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్లు దొరికే పరిస్థితి కనిపించలేదు. దాదాపు ప్రతిచోట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

ఒక మాస్ స్టార్ గా, టయర్ వన్ లీగ్ లోకి వెళ్లేందుకు నానికి దక్కిన బ్రహ్మాండమైన ఛాన్స్ ఇది. ప్రాథమికంగా వచ్చిన టాక్ ఏంటనేది పక్కనపెడితే ఒక క్రౌడ్ పుల్లర్ గా సరైన కాంబినేషన్ పడితే తన సత్తా ఏంటనేది నాని ఋజువు చేశాడు. అయితే ఇది వీకెండ్ తో మొదలుపెట్టి కనీసం రెండు వారాల పాటు ఎంత బలంగా నిలబడుతుందనే దాని మీద నాని టార్గెట్లు చేరుకోవడం, చేరుకోకపోవడం ఆధారపడి ఉంటుంది. ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

జూన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సందడి ప్యారడైజ్ థియేటర్లలోనే కనిపిస్తోంది. టికెట్ల కోసం రికమండేషన్లు, ప్రీమియం స్క్రీన్లలో షోల డిమాండ్ మాములుగా లేవు. చిన్న చిన్న సి సెంటర్స్ లో సైతం ఆన్ లైన్ లోనే టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఆయా షేర్, యెషనాగుల కట్ట పాటలు అనిరుధ్ రవిచందర్ పనితనం మీద కొండంత భరోసా తీసుకొచ్చి ఓపెనింగ్స్ కి మరింత ప్లస్ అయ్యాయి.

కమర్షియల్ గా ప్యారడైజ్ ఏ దిశగా వెళ్తుందనేది రాబోయే సోమవారానికి ఒక అంచనాకు రావొచ్చు. సోషల్ మీడియా మొత్తం ఈ మూవీ ముచ్చట్లతో నిండిపోయింది. రెగ్యులర్ మూవీ లవర్స్ లో అరవై డెబ్భై శాతం మంది టికెట్ రేట్ పట్టించుకోకుండా నిన్న రాత్రే ప్యారడైజ్ చూశారు. ఆ రేంజ్ లో నాని, శ్రీకాంత్ ఓదెల అంచనాలు పెంచేశారు. మోహన్ బాబు విలనిజం, యాక్షన్ బ్లాక్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. చూడాలి మరి జడల్ జమానా ఫైనల్ గా ఏ తీర్పు తెచ్చుకుంటుందో.