మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం వింటున్న మాట. కానీ ఇప్పుడు డైలాగ్ మారుతోంది. మీవారు ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ హాజ్బెండ్ అనే సమాధానం టక్కున వినిపిస్తోంది. ఇందులో తప్పేం వుందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించడం చర్చకు దారితీసింది. ఇంతకూ విషయం ఏమిటంటే…
తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందిన భార్యా భర్తల మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఇద్దరూ డాక్టర్లు కావడంతో సమస్య హై లెవెల్ కు చేరింది. దాంతో కేసు హై కోర్టు మెట్లెక్కింది. మధురై ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఎండీ సుమతి చేసిన వ్యాఖ్యలు మారుతున్న వైవాహిక సంబంధాలకు అద్దం పట్టింది. సమాజంలో హౌస్ వైఫ్ వున్నట్లే హౌస్ హాజ్బెండ్ ఎందుకు ఉండకూడదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇది న్యూ నార్మల్ కావాలని సలహా కూడా ఇచ్చారు.
ఇప్పుడు రోజులు మారిపోయాయి. డిజిటల్, ఏఐ కాలంలో వున్నాము. పూర్వం రోజుల్లో కుటుంబ ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలు భర్త చూడటం జరిగేది. ఇంటి వ్యవహారాలను భార్య చక్కదిద్దేది. ఇప్పుడు భార్యా భర్త ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే కానీ ఇళ్లు గడవని దుస్థితి దాపురించింది. మహిళలల్లో అక్షరాస్యత పెరగడం, ఉన్నత చదువులు చదువుకోవడం బాగా పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పాత్రలు మారిపోయాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. నేటి ఆధునిక మహిళలు కేరీర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి గిల్లీ జాంతానై అంటూ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది వివాహాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని మద్రాస్ హై కోర్టు చెప్పింది. ఈ క్రమంలో భార్యా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే భర్త హౌస్ హాజ్బెండ్ గా కుటుంబ బాధ్యతలు చూసుకోవడం వలన వివాహ బంధాలు బలోపేతం అవుతాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ముందు మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ లాగ హౌస్ హాజ్బెండ్ పాత్ర పోషించేందుకు సిద్ధమైతే ఆల్ హ్యాపీగా వుంటారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates