ఒక చిన్న `క్లాజ్‌`… 2 ల‌క్ష‌లు ఫైన్ వేసింది.. మ‌న‌కూ తెలిస్తే మంచిది!

ఒక్క చిన్న క్లాజ్‌… ఒక మ‌హిళ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌గా.. మ‌రో అధికారికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల పెనాల్టీ విధించేలా చేసింది. అయితే.. ఈ కేసు `ఆమెకు` మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. స‌మ‌స్య ఆమెదే అయినా.. పాఠం అంద‌రికీ నేర్పుతోంది. అదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మ‌హిళ‌ల‌కు దిక్సూచిగా కూడా మారింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి స‌మ‌స్య ఎదురైతే.. ఏం చేయాలో తేల్చి చెప్పింది. ర‌క్ష‌ణ క‌వ‌చంగా కూడా మారింది.

విష‌యం ఏంటి?

మ‌న దేశంలో అతి పెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ‌.. రైల్వే. ఎన్ని కార్లు, ఎన్ని బ‌స్సులు ఉన్నా.. రైల్వే ఆద‌ర‌ణ నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ రైల్వేలో చ‌ట్టాలు కూడా బ‌లంగానే ఉన్నాయి. అయితే.. వాటిని తెలుసుకునే ప్ర‌య‌త్నం మ‌నం చేయ‌డం లేదు. ఇక‌, మ‌హిళ‌ల‌కు రైల్వే శాఖ పెద్ద‌పీట వేస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళ మ‌హిళ‌లు ఒంట‌రిగా ప్ర‌యాణం చేయాల్సివ‌స్తే.. ఖ‌చ్చితంగా ఆ బోగీని ఒక‌టికి ప‌ది సార్లు రైల్వే పోలీసులు ప‌హారా కాయాలి. త‌ర‌చుగా వ‌స్తూ ఉండాలి. మ‌హిళ సుర‌క్షితంగా గ‌మ్యం చేరేవర‌కు వారు బాధ్యులు.

అదే స‌మ‌యంలో మ‌హిళ‌లు రాత్రి వేళ రైల్లో ప్ర‌యాణిస్తుంటే.. వారివ‌ద్ద టికెట్ ఉన్నా.. లేకున్నా.. అర్ధంతరంగా న‌డిమ‌ధ్య‌లో దింపేయ‌రాద‌న్న‌ది క్లాజ్‌. పొర‌పాటుకు ఫైన్ వేయొచ్చు.. త‌ప్ప మ‌ధ్య‌లో వారిని దింపేయ‌రాదు. ఇక‌, రిజ‌ర్వేష‌న్ టికెట్ ఉండి.. అది క‌న్ఫ‌ర్మ్ కాక‌పోయినా.. స‌ద‌రు మ‌హిళ‌ను మ‌ధ్య‌లో వదిలేయకూడ‌దు. తాజా కేసు విష‌యానికి వ‌స్తే.. తిరువ‌నంత‌పురానికి చెందిన మ‌హిళ‌.. అర్ధ‌రాత్రి రైల్లో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఆమె రిజ‌ర్వేష‌న్ టికెట్‌ను ప‌రిశీలించిన టీటీఈ.. అది క్యాన్సిల్ అయిందని.. కాబ‌ట్టి.. దిగిపోవాల‌ని ఆదేశించాడు. ఆమె నిరాకరించినా.. బ‌ల‌వంతంగా న‌డిరాత్రి ఓ దిక్కుమొక్కులేని స్టేష‌న్‌లో దింపేశాడు.

దీనిపై ఆమె మాన‌వ‌హ‌క్క‌లు సంఘంలో పిటిష‌న్ వేశారు.  దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సంఘం.. రైల్వే క్లాజులు, చ‌ట్టాల ప్ర‌కారం.. ఒక మ‌హిళ‌..  రాత్రి స‌మ‌యంలో రైలు ఎక్కితే.. ఆమెకు టికెట్ ఉన్నా.. లేకున్నా.. ఒక‌వేళ రిజ‌ర్వేష‌న్ క‌న్ఫ‌ర్మ్ కాక‌పోయినా.. గ‌మ్యం చేరేవ‌ర‌కు ఆమెను దింప‌డానికి వీల్లేదు. కావాలంటే నిబంధ‌న‌ల మేర‌కు ఫైన్ విధించ‌వ‌చ్చు. తాజా కేసులో రిజ‌ర్వేష‌న్ టికెట్ క్యాన్సిల్ అయింద‌న్న కార‌ణాన్ని చూపి.. ఆమెను న‌డిరేయి మార్గ‌మ‌ధ్యంలో దింపేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ నేప‌థ్యంలో రైల్వే శాఖ‌కు 2 ల‌క్ష‌ల ప‌రిహారం విధించింది. దానిని బాధితురాలికి ఇవ్వాల‌ని ఆదేశించింది. అదేస‌మ‌యంలో స‌ద‌రు టీటీఈ నుంచి ఆ మొత్తం వ‌సూలు చేసుకోవాల‌ని పేర్కొంది.

మ‌న‌కు తెలిసేది ఏంటంటే..

ఈ విష‌యం నుంచి మ‌న‌కు తెలిసేది ఏంటంటే.. మ‌న‌లో కూడా అనేక మంది మ‌హిళ‌లు ఒంట‌రిగా రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తారు. ఏ చిన్న కార‌ణంతోనో.. రైల్వే అధికారులు మార్గం మ‌ధ్య‌లో దింపేసే అవ‌కాశం ఉంటుంది. అలాంటి వాటి నుంచి మ‌న‌ల్ని మ‌నం రక్షించుకునేందుకు.. గ‌మ్యం చేరే వ‌ర‌కు దిగులు చింతా లేకుండాప్ర‌యాణించేందుకు ఈ కేసు ఒక ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌.