అప్పుడు పాక్‌కు చిక్కిన హీరో… ఇప్పుడు ప్రయాణికుల పైలట్

2019లో పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరుతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు అతను కొత్త కెరీర్ మొదలుపెట్టారు. దాదాపు 22 ఏళ్ల పాటు భారత వైమానిక దళంలో పనిచేసిన అభినందన్, ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఫ్లై91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న అభినందన్ మార్చి 31న ప్రీమేచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. 

ఆ తర్వాత గోవా కేంద్రంగా పనిచేసే ఫ్లై91లో చేరారు. ప్రస్తుతం గోవా – హైదరాబాద్ రూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అవసరమైన ట్రైనింగ్, అనుమతులు పూర్తయిన తర్వాత ప్రయాణికుల విమానాలను నడపనున్నారు. ఫ్లై91 ప్రస్తుతం ఏటీఆర్ 72-600 విమానాలతో ప్రాంతీయ సర్వీసులు నడుపుతోంది. దీంతో మిగ్-21 బైసన్ లాంటి ఫైటర్ జెట్ నడిపిన అభినందన్ ఇప్పుడు ఏటీఆర్ ప్యాసింజర్ విమానం కాక్‌పిట్‌లో కనిపించనున్నారు. 

అయితే ఆయన రెగ్యులర్ సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం ఇంకా బయటకు రాలేదు. అభినందన్‌కు 2019 ఫిబ్రవరి 27న జరిగిన ఘటనతో గుర్తింపు వచ్చింది. భారత అధికారిక రికార్డుల ప్రకారం తన మిగ్-21తో పాకిస్థాన్ ఎఫ్-16ను కూల్చారు. అదే పోరులో ఆయన విమానం కూడా దెబ్బతింది.

ఎజెక్ట్ అయిన తర్వాత పాకిస్థాన్ భూభాగంలో దిగడంతో అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల తర్వాత భారత్‌కు తిరిగివచ్చారు. ఆ ఘటనలో చూపిన ధైర్యానికి అభినందన్‌కు వీర్ చక్ర లభించింది. 2021లో గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోషన్ కూడా పొందారు. ఇప్పుడు మాత్రం యుద్ధ విమానాల నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ వైపు మారారు. ఫ్లై91లో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏ రూట్లలో సేవలు ప్రారంభిస్తారో చూడాలి.