భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి సంస్థ‌(టీజీ ఐఐసీ) ప‌లు ప్రాంతాల్లో భూముల‌ను విక్ర‌యిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాయ‌దుర్గం భూములు బంగారాన్ని మించిపోయాయి. గ‌త వారం.. ఇక్క‌డ ఎక‌రం 264 కోట్ల రూపాయ‌లు ప‌ల‌క‌గా.. కేవ‌లం వారంలోనే మ‌రో ఐదు కోట్ల రూపాయ‌లు ఎగబాకి.. శుక్ర‌వారం ఏకంగా 269 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌ల‌క‌డం విశేషం. వేలం ద్వారా ఈ భూముల‌ను రియ‌ల్ ఎస్టేట్ సంస్థలు ద‌క్కించుకుంటున్నాయి.

రాయ‌దుర్గం స‌ర్వే నెంబ‌రు 83/1లోని 5.38 ఎకరాల‌ను విక్ర‌యించేందుకు గ‌త సోమ‌వారం ప్ర‌భుత్వం ఐఐసీకి అనుమ‌తి ఇచ్చింది. వెంట‌నే రంగంలోకి దిగిన ఐఐసీ.. ఎక‌రం భూమిని 175 కోట్ల రూపాయ‌లుగా నిర్ధారించింది. ఈ క్ర‌మంలో ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ద‌ర‌ఖాస్తు ధ‌రే.. 2 ల‌క్ష‌ల రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ఇక‌, వేలంలో పాల్గొనేందుకు క‌నీసం 10 కోట్ల రూపాయ‌ల‌ను ముందుగా చెల్లించాల‌ని ష‌ర‌తు విధించారు. అయిన‌ప్ప‌టికీ.. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి.. ప‌లు రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు వేలంలో పాల్గొన్నాయి.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభమైన వేలం ప్ర‌క్రియ రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సాగింది. చివ‌ర‌కు వంశీరాం బిల్డర్స్ అనే సంస్థ ఎక‌రా భూమిని 269 కోట్ల రూపాయ‌ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ సంస్థే మొత్తం 5.38 ఎక‌రాల‌ను సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా ఐఐసీకి దాదాపు 1500 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూరింది. గ‌త గురువారం నిర్వ‌హించిన వేలంలో 264 కోట్ల రూపాయ‌ల చొప్పున ఓ సంస్థ 5 ఎక‌రాల‌ను ద‌క్కించుకుంది. తాజా వేలంలో 5 కోట్ల రూపాయ‌ల అధిక మొత్తం ల‌భించడం విశేషం.

ఎందుకింత ధ‌ర‌?

రాయ‌దుర్గంలో భూముల ధ‌ర‌లు ఎందుకు ఇంత‌గా పెరుగుతున్నాయనే ప్ర‌శ్న సాధార‌ణంగా వినిపిస్తుంది. దీనికి స‌మాధానం.. రాయదుర్గంలో ఐటీ కారిడార్ విస్తరణ, అత్యుత్తమ మౌలిక వసతులు, భారీ వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు ఏర్ప‌డ‌డ‌మే కార‌ణం. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ హబ్‌కు రాయ‌దుర్గం అత్యంత స‌మీపంలో ఉండ‌డం, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రధాన ఐటీ కేంద్రాలు ఈ ప్రాంతానికి స‌మీపంలో ఉండటం వంటివి భూములను బంగారం చేస్తున్నాయి. ఫ‌లితంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థ‌ల‌తోపాటు కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తీవ్రంగా పోటీ ప‌డుతున్నాయి.