తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం.
మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్, క్లీనర్ పరారైనట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రెండు ప్రమాదాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates