స్కూల్ బంక్ కొట్టి ఈ అమ్మాయిలు ఏం చేశారంటే?

హైదరాబాద్‌లో చదువుకుంటున్న స్కూల్ విద్యార్థినులు 1980ల రోజుల‌ను గుర్తు చేశారు. అప్పట్లో కాలేజీకి వెళ్లే విద్యార్థులు బంక్ కొట్టి సినిమాలకు వెళ్లడం.. పార్కులకు వెళ్లడం అదో ముచ్చట. తల్లిదండ్రులకు కొంత మేరకు ఇబ్బందే అయినా.. ఆ రోజుల్లో అలానే సాగిపోయేవి. అయితే.. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు రావడంతో ఈ తరహా పరిస్థితి తగ్గుముఖం పట్టింది. పైగా కాంపిటిషన్ ప్రపంచంలో విద్యార్థుల మధ్య పోటీ పెరిగి.. బంక్ కొట్టే సంస్కృతి ఇటీవల కాలంలో తగ్గింది.

అయితే.. తాజాగా హైదరాబాద్‌లోని మెహదీపట్నం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు.. మరోసారి 1980ల రోజులను గుర్తు చేశారు. 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థినులు.. మంగళవారం బుద్ధిగా బడికి వచ్చారు. ప్రార్థనా కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం.. క్లాస్‌కు కూడా వెళ్లారు. అక్కడ హాజరు వేయించుకున్నారు. తొలి రెండు పీరియడ్లకు కూడా తరగతి గదుల్లోనే ఉన్నారు. అయితే.. ఆ తర్వాతే.. సీన్ యూటర్న్ తీసుకుంది.

ఇంటర్వెల్ సమయంలో స్కూలు బ్యాగులు, పుస్తకాలు.. తెచ్చుకున్న టిఫిన్ క్యారియర్లను కూడా అక్కడే వదిలేసి.. పాఠశాల నుంచి బయటకు వచ్చారు. ఐదుగురు విద్యార్థినులు కలిసి.. ఐనాక్స్ సినిమాకు వెళ్లిపోయారు. అప్పుడు సమయం సుమారు 11.30 అవుతుంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్కూల్లో అన్నం వడ్డిస్తుండగా.. వీరి ప్రస్తావన వచ్చింది. ఇంకేముంది.. అందరికీ దడ దడ.. విద్యార్థినుల వయసు 13-14 ఏళ్ల మధ్య ఉండడం.. వారు స్కూల్‌కు వచ్చి హాజరు వేయించుకుని కనిపించకపోవడంతో ప్రధానోపాధ్యాయుడికి చుక్కలు కనిపించాయి.

అసలే రోజులు బాగోలేవని భావిస్తున్న నేపథ్యంలో హుటాహుటిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులకు కూడా కబురు పెట్టారు. ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగారు. ఎక్కడ వెతికినా.. ఆచూకీ లభించలేదు. పోనీ.. చుట్టుపక్కల సీసీటీవీలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించారు. అవి కూడా కనిపించలేదు. దీంతో మరింత టెన్షన్ పెరిగిపోయింది.

చివరకు.. సాయంత్రం అయిపోయింది. 4 గంటల సమయంలో ఐదుగురు విద్యార్థినులు ఎంచక్కా.. ఆడుతూ.. పాడుతూ.. హుషారుగా స్కూల్‌కు చేరుకున్నారు. విషయం ఏంటని నిలదీస్తే.. సినిమాకు వెళ్లామని భేషుగ్గా చెప్పుకొచ్చారు. దీనికి నవ్వాలో ఏడవాలో తెలియక.. పోలీసులు, స్కూల్ సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఎమ్మెల్యే మాత్రం హెచ్.ఎం.కు క్లాస్ ఇచ్చేశారు.