అంతర్జాతీయ క్రికెట్లో స్లెడ్జింగ్ అనగానే గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా జట్టే. ఒకప్పుడు తమ ఆటతో ఎంతగా భయపెట్టేవాళ్లో.. స్లెడ్జింగ్‌తోనూ అదే స్థాయిలో ప్రత్యర్థి ఆటగాళ్లను బెదరగొట్టేవాళ్లు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బ తీసేలా ఆ జట్టు వికెట్ కీపర్.. సమీపంలో ఉన్న ఫీల్డర్లు ఏదో ఒకటి అనడం మామూలే.
ఒకప్పుడు భారత ఆటగాళ్లు మెతకగా ఉండేవాళ్లు. మాటకు మాట బదులిచ్చేవాళ్లు కాదు. కానీ గంగూలీ కెప్టెన్ అయ్యాక కథ మారింది. అతను దీటుగా ప్రత్యర్థి ఆటగాళ్లకు బదులివ్వడం.. అవసరమైతే తనే ఎక్కువగా స్లెడ్జింగ్ చేయడం, గొడవకు దిగడం ద్వారా వాళ్లకు కళ్లెం వేశాడు. అదే సమయంలో మనోళ్ల ఆట కూడా మెరుగైంది. 2001లో టెస్టు సిరీస్ గెలిచాక ఆస్ట్రేలియన్ల ఆటకు, మాటకు భయపడే పరిస్థితులు పూర్తిగా పోయాయి. ఇప్పుడైతే మన కెప్టెన్ కోహ్లి జోలికి వెళ్లడానికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భయపడిపోతుంటారు. అతణ్ని కవ్విస్తే ఇంకా రెచ్చిపోయి ఆడతాడని వాళ్ల భయం.
ఐతే ప్రస్తుత టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ తర్వాత కోహ్లి సిరీస్‌కు దూరం కావడంతో కంగారూ ఆటగాళ్లు మనోళ్లను కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. సిడ్నీలో సోమవారం ముగిసిన మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మన అశ్విన్‌ను కవ్వించాలని చూశాడు. ఆస్ట్రేలియా గెలుపు ఖాయమనుకున్న సమయంలో విహారితో కలిసి అద్భుతంగా పోరాడి మ్యాచ్ డ్రాగా ముగించడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
ఐతే మధ్యలో అశ్విన్ ఏకాగ్రత దెబ్బ తీయడం కోసం పైన్.. ‘‘అశ్విన్ నువ్వెప్పుడెప్పుడు గబ్బాకు వస్తావా అని చూస్తున్నా’’ అన్నాడు. గబ్బా మైదానం పేసర్ల స్వర్గధామం. అక్కడ ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డుంది. అక్కడ బ్యాటింగ్ చేయడం ప్రత్యర్థి జట్లకు చాలా కష్టం. ఈ ఉద్దేశంతోనే పైన్.. అశ్విన్ గబ్బా పేరెత్తి అశ్విన్‌ను భయపెట్టాలని చూశాడు. ఐతే అశ్విన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ‘‘నువ్వు ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తావా అని చూస్తున్నా. అదే నీకు చివరి సిరీస్ అవుతుంది’’ అంటూ పేలిపోయే పంచ్ ఇచ్చాడు. దీంతో పైన్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఈ మాటలన్నీ స్టంప్ కెమెరాలో రికార్డయ్యాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Click Here for Recommended Movies on OTT (List Updates Daily)