మంచు మనోజ్ సినిమాలో రవి మోహన్?

కెరీర్లో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. రీఎంట్రీలో అతను ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఆ తర్వాత ఓవైపు హీరోగా నటిస్తూనే ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలోనూ నటిస్తున్నాడు. హీరోగా ఆల్రెడీ ‘డేవిడ్ రెడ్డి’ అనే క్రేజీ మూవీని చకచకా పూర్తి చేస్తున్నాడు మనోజ్. ఆ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి హైప్ కూడా క్రియేటైంది.

మరోవైపు మనోజ్ సైలెంటుగా ‘వడ్డీ కాసుల వాడ’ అనే ఎంటర్టైనర్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని తేజ్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఎక్కువగా వెరైటీ సినిమాల్లో నటించే మనోజ్.. మంచి కామెడీ ఎంటర్టైనర్ చేసి చాలా కాలమైంది. అతణ్ని ‘బిందాస్’, ‘కరెంటు తీగ’, ‘పోటుగాడు’ లాంటి ఎంటర్టైనర్లలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘వడ్డీ కాసుల వాడ’ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది.

ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వరస్వామికి, ఆయన భక్తుడికి మధ్య సాగే కథ అట. ఈ ఫాంటసీ కథలో శ్రీవారి పాత్రను తమిళ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ చేయబోతున్నట్లు సమాచారం. తమిళంలో పెద్ద స్టార్లలో ఒకడైన రవి తెలుగు కుటుంబానికి చెందిన వాడే. రవి తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగువాడు. తెలుగులో ఎన్నో చిత్రాలను కూడా నిర్మించారు. కానీ చెన్నైలో కుటుంబం స్థిరపడడంతో ఆయన కొడుకులు మోహన్ రాజా, రవి మోహన్ తమిళ సినిమాలు చేస్తూ అక్కడే ఎదిగారు.

ఇప్పటిదాకా డబ్బింగ్ సినిమాలతో పలకరించిన రవికి ‘వడ్డీ కాసుల వాడ’ తొలి తెలుగు చిత్రం. తెరపై వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించడాన్ని అదృష్టంగా భావిస్తారు. అందుకే రవి ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ చిత్రం రవికి తెలుగులో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన నిర్మాణంలో మనోజ్ ‘బిందాస్’ లాంటి హిట్ మూవీలో నటించాడు. చాలా ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతోంది.