విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆ దేశంలో విహార యాత్రకు వెళ్లిన 15 మంది భారతీయులు దుర్మరణం చెందారు. మరో 23 మంది క్షతగాత్రులుగా మిగిలారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటుగా తమిళనాడుకు చెందిన వారూ ఉన్నారు. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ లావా ఏర్పాటు చేసిన విహార యాత్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

లావా కంపెనీ తన వ్యాపార భాగస్వాములకు వియత్నాంలో విహార యాత్రను ఆపర్ చేసింది. ఆ సంస్థ మొబైల్ ఫోన్ల సేల్స్ లో సత్తా చాటిన పలువురు ఈ యాత్రకు ఎంపికయ్యారు. విహార యాత్రలో బాగంగా భారత్ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు.

యాత్రలో భాగంగా శనివారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 32 మందితొ పాటు మొత్తం 47 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో కలిసి సముద్రంలో విహారానికి వెళ్లిన స్పీడ్ బోటు నడి సంద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 23 మందిని సహాయక సిబ్బంది కాపాడగా… 15 మంద మృత్యువాత పడ్డారు. మరో 9 మంది గల్లంతయ్యారు.

మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరణించిన వారిలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జయశ్రీ భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక గల్లంతైన వారిలో ఏపీకి చెందిన మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

వియత్నాంలోని పు క్వాక్ లోని అన్ థోయ్ ద్వీపం సమీపంలో హోన్ మే రూట్ వద్ద స్పీడు బోటు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదానికి గురైన వారిలో  అత్యదికులు భారతీయులే కావడంతో అక్కడి భారత ఎంబసీ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది.