రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తులతో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో అతని భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు, పోక్సో కేసు బాధిత బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రత్తమ్మ ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ వేధింపులకు పాల్పడడంతో బాధిత బాలిక కుటుంబం ఈ ఏడాది మే 16న అతనిపై పోక్సో కేసు నమోదు చేసింది. అనంతరం బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్, కేసు పెట్టారనే కక్షతో తెల్లవారుజామున బాధితుల ఇంటికి వెళ్లి ముందుగా బాలిక, ఆమె తల్లి, నానమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు చిన్నారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపినట్లు తెలిపినట్లు సమాచారం. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఒకే ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో దైవాలగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates