రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి.. తొలకరి జల్లులు మొదలు వాతావరణం కాస్తంత చల్లబడే పరిస్థితి. అందుకు భిన్నంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దుస్థితి. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా.. వర్షాలు ఆశించినంత స్థాయిలో కురవకపోవటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమొదవుతున్నాయి.
రానున్న మూడు రోజులు ఎండ మంట తెలంగాణలో ఖాయమని వాతావరణ శాఖ అధికారులు చెబుతుంటే.. ఏపీలో మాత్రం వర్షాలకు అవకాశం ఉంటుందన్న చల్లని వార్తను అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గడిచిన రెండు రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు చూస్తే.. సాధారణం కంటే 3 – 6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలను చూస్తే.. అదిలాబాద్ లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణలో 20 జిల్లాలకు పైనే 40 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు నమోదు కావటం చూస్తే.. ఎండల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది.
రానున్న మూడు రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు. తెల్లవారు జామున చల్లగా ఉన్నప్పటికి ఉదయం ఎనిమిది గంటలు అయ్యేసరికి వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాస్తంత రిలీఫ్ ఇచ్చే అంశం ఏమంటే.. దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా బుధవారం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు.
అదే సమయంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత.. ఎండ తీవ్రత కూడా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా మధ్యామ్న సమయంలో బయటకు వెళ్లే వారు అవసరమైతేనే వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద.. విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్.. ఆసిఫాబాద్.. మంచిర్యాల.. నిర్మల్.. నిజామాబాద్.. జగిత్యాల.. జయశంకర్ భూపాలపల్లి.. ములుగు.. కొత్తగూడెం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడగాల్పులు వీస్తాయని చెబుతున్నారు. రానున్న మూడు రోజులు తెలంగాణలోని అత్యధిక ప్రాంతాల్లో ఎండ మంట ఖాయమన్న మాట వినిపిస్తోంది. సో.. జర జాగ్రత్త.
Gulte Telugu Telugu Political and Movie News Updates