అమెరికాలో పనిచేసేందుకు వెళుతున్న సాంకేతిక నిపుణులకు ఆ దేశ న్యాయస్థానం భారీ ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి టెక్నాలజీలో అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులకు ఆ కోర్టు తీపి కబురు చెప్పిందని చెప్పక తప్పదు. అమెరికాకు మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాద్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో చేస్తున్న మార్పుచేర్పులకు ఆ కోర్టు ఓ చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పాలి. హెచ్1బీ విసాల కోసం చెల్లించాలంటూ ట్రంప్ ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల రుసుము చెల్లదంటూ ఆ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల పట్ల అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. పన్నులను ఓ రేంజిలో పెంచేసిన ట్రంప్… అన్ని దేశాలతో వైరం కొని తెచ్చుకున్నారని కూడా చెప్పాలి. అంతటితో ఆగని ట్రంప్.. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాన్ని సముపార్జించుకున్న ఇతర దేశస్తులు అమెరికాలో ప్రవేశించరాదన్న కోణంలో వృత్తిపరమైన వీసాల జారీని కఠినతరం చేశారు. వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణులుగా ఎదుగుతున్న భారతీయులను ట్రంప్ తీవ్ర భయాందోళనలకు గురి చేశారని చెప్పాలి.
ఓ వైపు ట్రంప్ తీసుకున్న ఈ తరహా దుందుడుకు నిర్ణయాలపై విశ్వవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుండగా…అమెరికా కోర్టులు వరుసబెట్టి ట్రంప్ నిర్ణయాలను తప్పుబడుతూ తీర్పులు చెబుతున్నాయి. ఈ క్రమంలో హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజులను పెంచుతూ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
అసలు వృత్తి నిఫుణుల అవసరం, ఆయా కంపెనీల అవసరాల గురించి ట్రంప్ కు అవగాహన లేదని ఈ సందర్భంగా అమెరికా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సొరోకిన్ వ్యాఖ్యానించారు. కీలకమైన రంగాల్లో ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను కాంగ్రెస్ ఎలా అంగీకరిస్తుందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
హెచ్1బీ వీసాల ఫీజులను అమాంతంగా పెంచడం కుదరదంటూ సదరు కోర్టు వెలువరించిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తమ చేతిలోని వృత్తి నిపుణుతను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు బంగారు భవిష్యత్తు అందించాలని కలలు కంటున్న సాంకేతిక నిపుణులు ట్రంప్ నిర్ణయంతో ఆందోళనలో కూరుకుపోయినా… ఆ నిర్ణయం చెల్లదంటూ తాజాగా అమెరికా ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో వారికి భారీ ఉపశమనం లభించినట్టు అయ్యింది.
అంతే కాకుండా అమెరికాలో ఇక ఉద్యోగ భద్రతకు అంతగా ఇబ్బంది ఉండదన్న భావనా వ్యక్తం అవుతోంది. అయితే ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసేందుకు ట్రంప్ సర్కారు యత్నిస్తున్నట్లుగా సమాచారం. అయినా కూడా ఈ తీర్పులో పెద్దగా మార్పు ఉండబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates