ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్ లాంచ్, ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మాములుగా రామ్ చరణ్ ఇంత చొరవ తీసుకుని ప్రతి చోటికి వెళ్లడం అరుదు. కానీ పెద్ది మీద ప్రాణం పెట్టేయడంతో ఎలాగైనా దీన్ని గ్లోబల్ ఆడియన్స్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేతి గాయాన్ని లెక్క చేయకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అందుకే అందరి చూపు బుకింగ్స్ మీద ఉంది.

ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర నగరాల అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే పెద్ది ట్రెండ్ కొంచెం నెమ్మదిగా ఉంది. ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం ఒక కారణమైతే ఐటెం సాంగ్ వైరల్ కాకపోవడం మరో రీజన్. అయితే చికిరి చికిరి ప్రభావం నార్త్ ఆడియన్స్ మీద లేకపోలేదు. కాకపోతే సినిమా కథలో నేటివిటీ వాళ్లకు కనెక్ట్ కావడం, మొదటి రోజు చూసిన జనాలు బయటికి చెప్పే టాక్ ని బట్టి కలెక్షన్లు ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి. పుష్ప 1 ది రైజ్ వచ్చినప్పుడు దానికి బాలీవుడ్ లో అంత క్రేజ్ లేదు. హక్కులు కొన్న గోల్డ్ మైన్స్ సంస్థ లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేసింది. తర్వాత సీన్ మారిపోయింది. రెండు మూడు రోజుల్లో ఒక్కసారిగా పుష్ప ఊపందుకుంది. ఆ సక్సెసే పుష్ప 2 ది రూల్ కి భీకరమైన ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. కానీ పెద్దికి ఆ అడ్వాంటేజ్ లేదు. సీక్వెల్ కాదు, అందులోనూ సింగల్ పార్ట్ మూవీ కాబట్టి జనాల స్పందన కీలకం కానుంది.

డబ్బింగ్, పబ్లిసిటీ విషయాల్లో ఏ చిన్న నిర్లక్షానికి తావు ఇవ్వకుండా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ఇక తీర్పు ప్రేక్షకుల చేతిలో ఉంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపు గేమ్ ఛేంజర్ కొంత ఆవిరి చేసినప్పటికీ పెద్దిలో ఉన్న ఎమోషన్, యాక్షన్ ఖచ్చితంగా హిందీ జనాలకు కూడా నచ్చుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లోనూ ఉంది. ప్రస్తుతానికి హిందీ పెద్దికి సంబంధించి ముందస్తు ప్రీమియర్స్ బుకింగ్ కనిపించడం లేదు. ఇవాళ రాత్రిలోగా ఏమైనా యద చేస్తారేమో చూడాలి.