నిజం నిప్పులాంటిదని తెలిసే లోపు పుకారు సముద్రమంత లోతుగా వెళ్ళిపోతుంది. అలా ఉంది సోషల్ మీడియా వ్యవహారం. ఇవాళ న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ చేయబోయే సినిమా బ్యాండ్ మేళం దర్శకుడు సతీష్ జవ్వాజితో ఉంటుందనే ప్రచారం రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు సతీష్ తన డెబ్యూతో మెప్పించింది పెద్దగా లేదు. అపరిపక్వ రైటింగ్ తో ఒక మాములు మాస్ ప్రేమకథని యావరేజ్ గా తెరెకెక్కించారు.
సరే ఒక్క సినిమాతో ఎవరి ప్రతిభను కొలమానం చేయలేం కానీ ప్రస్తుతం నానికి ఉన్న ఇమేజ్, మార్కెట్ పరిస్థితుల్లో తాను ఏ మాత్రం రిస్క్ చేసే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ది ప్యారడైజ్ మీద ఏర్పడుతున్న బజ్, ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతుందన్న నమ్మకంతోనే దానికి ఎక్కువ సమయం పడుతున్నా ఓపికతో భరిస్తున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ నమ్మకానికి తగ్గట్టుగానే వయొలెంట్ అవుట్ ఫుట్ సిద్ధం చేస్తున్నారనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది.
దీని తర్వాత సుజిత్ కు కమిటైన నాని కొత్త మేకోవర్ కోసం కొంచెం బ్రేక్ తీసుకుని అటుపై బ్లడీ రోమియో సెట్స్ లో అడుగు పెడతాడు. దీనికి ఎంత లేదన్నా ఆరేడు నెలల సమయం అవసరమవుతుంది. ఇంత ప్లాన్డ్ గా ఉన్న నాని కొత్త దర్శకుడిని నమ్మడం అంత సులభంగా ఉండదు. ఇదంతా చూసే నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ట్వీట్ వేయడం గమనార్హం. ఏదున్నా అఫీషియల్ గా చెబుతామని ఏదీ నమ్మొద్దని చెప్పింది.
ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే ఆగస్ట్ 21 విడుదలలో ఎలాంటి మార్పు లేదు. ఆ రిలీజ్ డేట్ కి కట్టుబడే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేస్తున్నారు. వాయిదా గురించి వస్తున్న గాసిప్స్ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. నాని కమిట్ మెంట్స్ దృష్ట్యా ఇప్పటికే చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఇంతకన్నా పోస్ట్ పోన్లకు ఛాన్స్ లేదు. ఎలాగూ జైలర్ 2 లాంటివి ఆగస్ట్ లో రావడం లేదు కాబట్టి ప్యారడైజ్ కు బిజినెస్ పరంగా మంచి ఛాన్స్ ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates