దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో కొంత కాలం ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ నడిచినా.. తర్వాత ఐమాక్స్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయి, దాన్ని పీసీఎక్స్ స్క్రీన్‌గా మార్చేశారు. ఇక అప్పట్నుంచి ఐమాక్స్ స్క్రీన్ కోసం తెలుగు వాళ్ల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.
ఏదైనా హాలీవుడ్ విజువల్ వండర్ రిలీజైతే మన సినీ ప్రముఖులు చెన్నైకో, ఇంకో సిటీకో వెళ్లి ఐమాక్స్ స్క్రీన్లో సినిమా చూసే పరిస్థితి. సినిమాల కోసం పడి చచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఏంటి అని బయటి వాళ్లే ఆశ్చర్యపోతుంటారు.
ఐతే నిరీక్షణకు తెరదించుతూ హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్‌ను తీసుకొస్తోంది ఏషియన్ సంస్థ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న ప్రదేశంలో మహేష్ బాబుతో కలిసి ‘ఏఎంబీ క్లాసిక్’ పేరుతో ఏషియన్ సంస్థ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనే ఐమాక్స్ స్క్రీన్ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.
ఐతే హైదరాబాద్‌లో ఇదొక్కటే ఐమాక్స్ స్క్రీన్ కాదన్నది విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు మరో స్క్రీన్ కూడా నిర్మితం కానుందట. అది కూడా ఏషియన్, మహేష్ బాబు కాంబినేషన్లోనే వస్తుందట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిర్మాణం జరుపుకునే స్క్రీన్‌ను మించి ఇంకా భారీగా హకీం పేటలో ఐమాక్స్ థియేటర్ రాబోతోందట. నిజానికి గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడినపుడు హకీంపేటలోనే ఐమాక్స్ వస్తుందని ప్రకటించారు.
కానీ అంతకంటే ముందు ఏఎంబీ క్లాసిక్‌లో ఐమాక్స్ స్క్రీన్ తీసుకొస్తున్నారు. హకీం పేట ప్రపోజల్ ఏమీ పక్కన పడేయలేదు. అక్కడ ఇంతకంటే భారీ ఐమాక్స్ థియేటర్ నిర్మిస్తారట. అంతే కాదు.. ఇండియాలోని మరో పెద్ద సిటీలో ఏఏంబీ ఆధ్వర్యంలో ఇంకో ఐమాక్స్ స్క్రీన్ కూడా నిర్మిస్తారట. ఒకవేళ అది వైజాగ్ లాంటి చోట వచ్చినా ఆశ్చర్యం లేదు. ఐమాక్స్ సంస్థతో మొత్తంగా మూడు స్క్రీన్లకు ఏఎంబీ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates