అనుకున్నట్లే జరిగింది.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్!

అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్ లో ఫైనల్ కు రావాల్సిన జట్లు రాలేదు. దీంతో టాప్ 3ని నమ్ముకున్న GTని అదే రూట్లో దెబ్బ కొట్టి కప్ కొట్టేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి కప్పు సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన జట్టుగా నిలిచింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు కేవలం 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి తోడుగా నిశాంత్ సింధు 20, జోస్ బట్లర్ 19 పరుగులు మాత్రమే చేయడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు.

భువనేశ్వర్, హాజిల్ వుడ్ గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేశాడు. కోహ్లీ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు బాది జట్టును గెలిపించాడు. అతనికి తోడుగా వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి స్కోరు మొదట్లోనే బూస్ట్ ఇచ్చాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 24 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. సిక్సర్ కొట్టిన వెంటనే కోహ్లీ హెల్మెట్ తీసి గాల్లోకి పంచ్ ఇస్తూ సంబరాలు చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంది. డగౌట్ లోని ఆటగాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకోవడం ఈ ఫైనల్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.