వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ గొడ్డలి లాంటి వారని, జగన్ పార్టీ గొడ్డలి పార్టీ అని… అలాంటి గొడ్డలి మనస్తత్వం కలిగిన వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాకూడదని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
మొన్న చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమేనన్నట్లుగా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గొడ్డలి లాంటి వారేనని… ఇంకా చెప్పాలంటే జగన్ గొడ్డలి కంటే ఎక్కువని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మహిళా నేతలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సజ్జల కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపైనా, జగన్ పైనా చంద్రబాబు సహా టీడీపీ నేతలు సంధించిన ఆరోపణలను ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు చెప్పినట్టుగా రాజకీయ ప్రత్యర్థులకు జగన్ గొడ్డలి లాంటి వారేనని సజ్జల అన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ గొడ్డలి కంటే ఎక్కువ అని, ఓ త్రిశూలం, ఓ కత్తి.. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాజకీయ శత్రువుల మీద పోరాటం చేసేందుకు జగన్ ఓ ఆయుధంగానే వస్తారని చెప్పారు.
మహిళలు తమ సొంత శక్తితో ఎదగాలన్న దిశగా జగన్… మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలను ప్రారంభించి అమలు చేశారని సజ్జల చెప్పారు. ఫలితంగా ప్రతి కుటుంబంలో మహిళ వేన్నీళ్లకు చన్నీళ్ల మాదిరిగా తోడ్పాటు అందించే దిశగా పురోగతి సాధించారన్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే మహిళలే కుటుంబ పెద్దలుగా, తమ సంపాదనే కుటుంబానికి ప్రధాన ఆధారంగా తయారయ్యారని, ఈ మార్పు జగన్ హయాంలోనే సాధ్యమైందన్నారు.
జగన్ మరింత కాలం అదికారంలో కొనసాగిఉంటే… మహిళలు మరింతగా వృద్ది సాధించేవారని, సమాజంలో పెను మార్పులు సంభవించేవని ఆయన అన్నారు. అయితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కారణంగా… మహిళల అభ్యున్నతి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. మొత్తంగా జగన్ ను గొడ్డలి అని, గొడ్డలి కంటే మరింత ఎక్కువని సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates