సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినప్పుడు.. వయోజనులు (మేజర్లు) అయిన వారు తమ సమ్మతితో వేశ్యావృత్తిని నిర్వహిస్తుండటం నేరం కాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో వ్యభిచార గృహం నడపటం.. ఇతరుల సంపాదన మీద మీద బతకటం.. బహిరంగ ప్రదేశాల్లో విటులను ఆకర్షించటం.. మైనర్లను బలవంతంగా ఇందులోకి దించటం మాత్రం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలుగా పేర్కొంది.
భారతీయ చట్టాల ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఒక వయోజనుడు (మేజర్) తన పూర్తి సమ్మతితో వేశ్యావృత్తిని నిర్వహించటం నేరం కాదని స్పష్టం చేసింది.
తాజా తీర్పులోని సున్నితమైన అంశం ఏమంటే.. స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్న వారికి.. అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడకూడదన్న విషయాన్ని సుప్రీం స్పష్టం చేసింది. తమ ఇష్టంతో వేశ్యావృత్తిలో ఉన్న వారిని ట్రాఫికింగ్ బాధితులుగా చూడొద్దని స్పష్టం చేసింది.
అలాంటి వారిపై అక్రమ రవాణా.. ఇతర సీరియస్ క్రిమినల్ కేసులు పెట్టి వేధించొద్దని పేర్కొంది. అంతేకాదు ట్రాఫికింగ్ బాధితులకు గౌరవప్రదమైన పునరావాసం పొందే హక్కు ఉంటుందని తేల్చింది. శుక్రవారం జస్టిస్ పార్థీవాలా.. జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం 22 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన ఒక సమగ్ర బాధితుల రక్షణ ప్రణాళికను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ను స్పష్టంగా పేర్కొంది.
ఇంతకూ సుప్రీంకోర్టు తీర్పులో కీలక అంశాలివే..
- ఒక కేసు మానవ అక్రమ రవాణా కిందకు వస్తుందా? లేదంటే స్వచ్ఛంద వేశ్యావృత్తి కిందకు వస్తుందా అని నిర్దారించటానికి వ్యక్తుల పరస్పర సమ్మతి అనేది అత్యంత కీలకమైన అంశమని కోర్టు స్పష్టం చేసింది.
- ఎక్కడైతే బలవంతంగా.. ఇష్టం లేకున్నా.. మోసంతోనో.. అక్రమ రవాణా జరిగినట్లుగా ఆధారాలు ఉంటాయో..అలాంటి సందర్భంలో సదరు వ్యక్తి ఇచ్చినట్లుగా చూపే సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదు. దీనికి కారణం.. బాధితురాలికి ఇష్టం లేకున్నా.. బలవంతంగా.. బెదిరింపులతో వేశ్యావృత్తిని నిర్వహించేలా చేస్తున్నారు కాబట్టి.. కచ్ఛితంగా అది చట్టవిరుద్ధమవుతుంది. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
- ఈ తీర్పులో అత్యంత కీలక అంశంగా దీన్ని చెప్పాలి. దాడులు జరిగిన చోట తక్షణ ప్రాథమిక విచారణ జరపాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న మహిళ లేదంటే బాధితురాలు ఎవరైనా వివక్ష.. శారీరక హింసకు గురవుతున్నారా? బలవంతపు ట్రాఫికింగ్ కు గురవుతున్నారా? అన్నది మాత్రమే పరిశీలించాలి. అదే సమయంలో సమ్మతితో వేశ్యావృత్తిలో ఉన్న మేజర్లు(వయోజనులు)నేరస్థులుగా చిత్రీకరించకూడదు
- ఒకవేళ అక్రమ రవాణాకు గురైన బాధితురాలిని ఆ బంధనాల నుంచి విముక్తి చేసే వేళ.. వారికి గౌరవప్రదమైన పునరావాసం కల్పించటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వారి ప్రాథమిక హక్కు అన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
- ఈ సందర్భంగా బాధితులను ఉంచే ప్రభుత్వ రక్షణ గృహాలు.. షెల్టర్ హోమ్స్ లలో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. వారికి తగిన మెంటల్ హెల్త్ సపోర్టు.. ఉచితంగా చట్టపరమైన సాయాన్ని అందించటంతో పాటు జీవనోపాధి కోసం ఒకేషనల్ (వృత్తి విద్యా) శిక్షణ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
- రాజ్యాంగం ద్వారా తమకు దఖలు పడిన అధికారం మేరకు (ఆర్టికల్ 32, 142 ప్రకారం) దేశ వ్యాప్తంగా వర్తించేలా బాధితుల రక్షణ ప్రణాళికను అమలు చేయాలని తాము ఆదేశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చే వేళ.. తమ మనసుల్ని స్ప్రశించిన కేసుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు.
- ఇంతకాలంగా బాధితుల రక్షణ.. పునరావాసం.. వివిధ విభాగాల సమన్వయం..ట్రాఫికింగ్ చట్టాల దుర్వినియోగం.. కేసుల దర్యాప్తులో నెలకొనే లోపాల్ని పరిగణలోకి తీసుకొని తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో తమ ఆదేశాలను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించేందుకు మూడు నెలల తర్వాత ఈ అంశంపై మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.
- ఈ తీర్పు సిద్ధం చేయటానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ పిల్ 22 ఏళ్లుగా న్యాయస్థానాల్లోనే ఉంది. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చాలా సమయం అన్న మాటను పేర్కొంటూ.. ఈ అంశంలో ఏ పుస్తకాలనూ చూడాల్సిన అవసరం ఉండదని తాము భావిస్తున్నట్లుగా తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ పార్దీవాలా పేర్కొనటం గమనార్హం. మరి.. ఈ అంశాలపై చట్టాల్ని అమలు చేసే వ్యవస్థలు ఎలా వ్యవహరిస్తాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates