సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి కొందరు ట్రోలింగ్ చేసే పనిలో ఉండగా, మరో వర్గం ఇంత గొప్ప గ్రాండియర్ మీద అప్పుడే నెగటివిటీ తీసుకురావడం మంచిది కాదని హితబోధ చేస్తున్నారు. ఈ మొత్తం క్రమంలో సీతగా నటించిన సాయిపల్లవి మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఆమె సూట్ కాలేదని, పక్కన ఉన్న చెలికత్తె బాగుందని ఏవేవో కంపారిజన్లు చేస్తున్నారు

ఈ బ్యాచ్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సీత క్యారెక్టర్ ఇప్పటిదాకా ఎందరో నటీమణులు పోషించారు. దశాబ్దాల తర్వాత కూడా లవకుశలో అంజలి దేవిని తప్ప వేరొకరిని ఊహించలేం. అంత గొప్పగా ప్రాణ ప్రతిష్ట చేశారు. చరిత్ర సృష్టించిన సంపూర్ణ రామాయణంలో నటించింది చంద్రకళ. ఆమెకు పెద్దగా ఇమేజ్ లేదు. రామాయణం సీరియల్ లో నటించిన దీపికా చికిలా కేవలం అందం వల్ల ఎంపిక కాలేదు. అభినయం చూశాక దర్శకుడు రామానంద సాగర్ ఛాన్స్ ఇచ్చారు.

శ్రీరామ రాజ్యంలో నయనతారను తీసుకోవడం వెనుక ఆడిషన్లు జరిగాయన్నది బయటికి అంతగా తెలియని వాస్తవం. రామాయణకు సైతం నితేశ్ తివారి చాలా కసరత్తు చేశారు. వార్ 2లో బికినీ వేసుకున్న కియారా అద్వానీనో లేదా పఠాన్ లో అందాలు ఒలకబోసిన దీపికా పదుకునేనో తీసుకుని ఉంటే ఇప్పుడీ స్థాయిలో ముంబై వర్గాల నుంచి అటాక్ ఉండేదా అంటే సమాధానం దొరకదు. సాయిపల్లవి డెబ్యూ ఏక్ దిన్ రిలీజైన తర్వాత కూడా తన మీద విమర్శల పర్వం కొనసాగింది.

సింపుల్ గా చెప్పాలంటే గ్లామర్ ప్రపంచానికి దూరంగా, తనకు నచ్చిన కథలను మాత్రమే చేసే సాయిపల్లవి లాంటి పెర్ఫార్మర్ ని అంగీకరించేందుకు కొందరు బాలీవుడ్ జనాలకు మనసు రావడం లేదు. అందుకే సినిమా రిలీజ్ కు ముందే అర్థం లేని పోలికలతో లేనిపోని రభస చేస్తున్నారు. వీటన్నింటికి సమాధానం దీపావళికి విడుదలయ్యే రామాయణలో ఉంటుంది. అప్పటిదాకా ఆగలేక , ఏదో ఒకటి చేయకపోతే రీచ్ రాదనీ భావించి ఇలా ఆమెను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళ పనే ఇది.