భాగ్యనగరం హైదరాబాద్‌లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన మహిళా ఐపీఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనర్(సీపీ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సుమతి చేసిన ఈ ప్రయోగం.. దాదాపు 40 మందికి పైగా యువతను పట్టుకునేలా చేసింది. అయితే.. అదేసమయం లో ఆమె పోకిరీల వేధింపులతో తాళలేకపోవడం గమనార్హం.
ఇటీవల మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా సుమతి బాధ్యతలు చేపట్టారు. అయితే.. మహిళా వేధింపుల కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సిటీలో పరిస్థితిని నేరుగా తెలుసుకోవాలని ఆమె భావించారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మల్కాజిగిరి.. చుట్టుపక్కల సెంటర్లలో ఆమె పంజాబీ డ్రస్‌లో సాధారణ యువతి మాదిరిగా బస్టాండ్‌లో నిలబడ్డారు. ఆమె అలా ఒంటరిగా నిలబడిన పది 15 నిమిషాల్లోనే పలువురు యువకులు.. ఆమెను చుట్టుముట్టారు.
వస్తావా.. రేటెంత.. ఒకరికి ఎంత? ఇద్దరైతే ఎంత? ఇలా.. అసభ్య పదజాలంతోఆమెను వేధించారు. అయితే.. వారికి ఆమె మహిళా ఐపీఎస్ అధికారి అన్న విషయం తెలియదు. కానీ, పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఐపీఎస్ సుమతి.. యువత తన చుట్టూ మూగిన తర్వాత.. నాలుగు అడుగులు ముందుకు వేసి.. వారు ఒకింత తనవైపు లగ్నం అవుతున్న సమయంలో సంకేతాలు ఇవ్వడంతో పోలీసులు వచ్చి యువతను అదుపులోకి తీసుకున్నారు.
ఇలా.. రెండు మూడు సెంటర్లలో సుమతి.. నిలబడి.. తెల్లవారు జామున 3 గంటల వరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఏ సెంటర్‌లో నిలబడ్డా అదే పరిస్థతిని ఆమె ఎదుర్కొన్నారు. ఒక చోట అయితే.. ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకల్లో ఒకడు.. ఆమె భుజంపై చేయి వేసే ప్రయత్నం చేయగా.. కాలితో తన్ని.. అక్కడ నుంచి పరుగు పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా.. మొత్తం 42 మందికిపైగా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతతోపాటు.. ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువత కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates