ఏపీ హైకోర్టులో జడ్జి వర్సెస్ లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వివాదం!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ న్యాయవాది పట్ల హైకోర్టు న్యాయమూర్తి ప్రవర్తించిన తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గట్టిగానే స్పందించింది. ఒక విచారణ సమయంలో ఒక పాత ఉత్తర్వు కాపీని సమర్పించలేదన్న కారణంతో జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు సదరు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసు కస్టడీకి పంపాలని కోర్టులోనే ఆదేశించడం సంచలనం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సదరు న్యాయవాది రెండు చేతులు జోడించి, “క్షమించండి సార్, నాకు అనారోగ్యంగా ఉంది.. దయచూపండి” అని వేడుకుంటున్నా జడ్జి శాంతించలేదు. పోలీసులను పిలిపించి అతన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. అయితే ఆ వెంటనే హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ఆ కస్టడీ ఆదేశాలను రద్దు చేసినట్లు సమాచారం.

ఈ ఉదంతంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌కు ఒక లేఖ రాశారు. ఒక చిన్న పొరపాటుకు యువ న్యాయవాదిని బహిరంగ కోర్టులో అంతలా అవమానించి, కస్టడీకి పంపాలని చూడటం న్యాయ వ్యవస్థ గౌరవానికి మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ లాయర్లు నేర్చుకునే క్రమంలో ఉంటారు కాబట్టి వారిని సరిదిద్దాలి తప్ప, ఇలాంటి చర్యల వల్ల వారు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.

కేవలం ఫిర్యాదు చేయడంతోనే ఆగకుండా, ఈ వ్యవహారంపై అధికారికంగా దృష్టి సారించాలని BCI డిమాండ్ చేసింది. సదరు జడ్జిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, అలాగే ఆయనకు న్యాయపరమైన విధుల కేటాయింపులో మార్పులు చేయాలని కోరింది. న్యాయమూర్తులకు ఉండాల్సిన సహనం, న్యాయవాదులతో ఉండాల్సిన సంబంధాల మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా సూచించింది.

ఏ అధికారాన్నయినా సంయమనంతో, మానవత్వంతో ఉపయోగించినప్పుడే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారం భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.