ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఓటమనేది ఎరుగని రాజస్థాన్ రాయల్స్ విజయయాత్రకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లను హైదరాబాద్ బౌలర్లు కకావికలం చేశారు. ముఖ్యంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఈసారి హైదరాబాద్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతాడని సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ కు ఎస్‌ఆర్‌హెచ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అనుభవం ఉన్న బౌలర్లను పక్కనపెట్టి, పూర్తిగా కొత్త కుర్రాళ్లను నమ్మిన హైదరాబాద్ మేనేజ్‌మెంట్ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గా నిలిచింది.
ఈ విజయంలో అసలైన హీరోలు అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్. ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రఫుల్ హింజ్ తన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ వేసిన మొదటి బంతికే డేంజర్ మ్యాన్ వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డకౌట్ అవ్వడం మ్యాచ్‌కే హైలైట్. ఆ తర్వాత జురెల్, ప్రిటోరియస్‌లను కూడా అదే ఓవర్లో పంపి రాజస్థాన్ కు షాక్ ఇచ్చాడు. కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్, ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ వ్యూహాలు ఈ మ్యాచ్‌లో పక్కాగా పనిచేశాయి. సాకిబ్ హుస్సేన్ కూడా తన మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు (4/24) తీసి రాజస్థాన్ లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ప్రఫుల్ హింజ్ (4/34) తన స్పెల్‌తో రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను చిన్నాభిన్నం చేశాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే ఇద్దరు బౌలర్లు నాలుగేసి వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కేవలం 159 పరుగులకే పరిమితం చేయడంలో ఈ ఇద్దరు కొత్త కుర్రాళ్ల పాత్ర గొప్పదే.
మరోవైపు హైదరాబాద్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 91 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ (40), నితీష్ కుమార్ రెడ్డి (28) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బ్యాటింగ్‌లో డొనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. లేదంటే రాజస్థాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది.
57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్, తమపై వస్తున్న విమర్శలకు మైదానంలోనే సమాధానం ఇచ్చింది. టేబుల్ టాపర్‌ను ఓడించడం ద్వారా తమలోనూ సత్తా ఉందని నిరూపించుకుంది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా మ్యాచ్ అనంతరం హైదరాబాద్ బౌలర్ల ప్రతిభను మెచ్చుకోక తప్పలేదు. హోమ్ క్రౌడ్ మద్దతుతో కొత్త బౌలర్లు చూపిన తెగువ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు పండగ తెచ్చింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ మళ్ళీ ప్లే ఆఫ్స్ రేసులోకి రావడమే కాకుండా, రాజస్థాన్ అజేయ రికార్డుకు చెక్ పెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
