హద్దులు దాటేస్తున్న పాక్ రక్షణ మంత్రి

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం దాయాది పాకిస్తాన్ కు అలవాటే. ఇటీవల కాలంలో ఆ దేశ రక్షణ మంత్రి.. విదేశాంగ మంత్రులు భారత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది. దీని వెనుకున్న అసలు కారణాలేంటి? అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే కోల్ కతాను టార్గెట్ గా చేసుకుంటామన్న ఆయన.. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకు తీసుకెళతామని వ్యాఖ్యానించారు.

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన స్వస్థలం సియాల్ కోట్ లో మీడియాతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు. బారత్ బూటకపు ఆపరేషన్ రూపొందించినట్లు నివేదికలు ఉన్నట్లుగా అక్కసు వెళ్లగక్కారు. ఈ మాట అన్న ఆయన.. అందుకు తగ్గ ఆధారాలు.. సాక్ష్యాలు చూపిస్తే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ చేయకపోవటం గమనార్హం. కొంతమంది డెడ్ బాడీలు పడేసి.. వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా భారత్ చేస్తుందని వ్యాఖ్యానించారు.

2025లో జరిగిన పహల్గాం దాడి.. అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జరిగి సంవత్సర కాలం అవుతున్న వేళలో ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కు పాల్పడితే తమ స్పందన కోల్ కతా వరకు ఉంటుందన్న ఆయన.. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతదేశంలోని సదూర ప్రాంతాల్లోఉన్న ఆర్ఎస్ఎస్ క్యాంపులపై దాడులు చేస్తామని పేర్కొన్నారు.

ఇటీవల కేంద్రరక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘పాక్ ప్రతిస్పందన వేగంగా.. కచ్ఛితంగా.. నిర్ణయాత్మకంగా ఉంటుందన్న ఆయన.. భారత్ మళ్లీ ఏదైనా దుస్సాహసం చేస్తే.. ఈసారి యుద్దం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని భారత భూభాగంలోకి చొరబడి ఇళ్లలో దూరి కొడతాం’’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.

ఇంతకూ ఆయన ఎందుకలా మాట్లాడారు? కారణాలేంటి? అన్న విషయంలోకి వెళితే ఇప్పటికే పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలకు మరో కారణం పాక్ ప్రజల ముందు లేని గాంభీర్యతను ప్రదర్శించటం..పాకిస్తాన్ – అఫ్గాన్ సరిహద్దుల్లో తాలిబన్లతో తలెత్తిన ఘర్షణలను ఎదుర్కోవటంలో ఫెయిల్ అవుతున్న ఆ దేశం.. అందుకు ప్రతిగా భారత్ ను బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పాలి. అంతేకాదు అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న పాక్.. తమకు చైనా అండ ఉందని చెప్పుకోవటం ద్వారా లేని బలం ఉన్నట్లుగా చూపించుకోవాలన్న మైండ్ గేమ్ ను ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పాలి.