ఐపీఎల్ కేసులో లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్

2009 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి అప్పీలేట్ ట్రైబ్యునల్ నుండి భారీ ఊరట లభించింది. సౌతాఫ్రికాలో ఐపీఎల్ 2 నిర్వహణ సమయంలో లలిత్ మోదీ వ్యక్తిగతంగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జూలై 16న వెలువడిన తీర్పులో ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మోపిన జరిమానాల ఉత్తర్వులను పూర్తిగా పక్కనబెట్టింది.

ఆ రోజుల్లో భారత్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ రెండో సీజన్‌ను అత్యవసరంగా దక్షిణాఫ్రికాకు తరలించాల్సి వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు పంపారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ లావాదేవీలు కరెంట్ ఖాతాకు చెందినవని, క్యాపిటల్ ఖాతాకు సంబంధించినవి కాదని ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది. దాంతో ఈడీ తయారుచేసిన కేసు మూలాలనే ట్రైబ్యునల్ తిరస్కరించినట్లయింది.

ఈ తీర్పుపై లలిత్ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. బిసిసిఐ ఫెమా నిబంధనలను పాటించేలా చూడటం లేదా ఆర్థిక అధికారాలు చలాయించడం తన పరిధిలోనిది కాదని ట్రైబ్యునల్ గుర్తించిందని ఆయన తెలిపారు. 16 ఏళ్లుగా తాను చెప్తున్న మాట నిజమని రుజువైందని, భారత క్రికెట్, ఐపీఎల్ మంచి కోసమే తాను నమ్మకంతో నిర్ణయాలు తీసుకున్నానని, ఎలాంటి వ్యక్తిగత తప్పులు చేయలేదని ఆయన వెల్లడించారు.

గతంలో 2018 మే నెలలో ముగిసిన విచారణలో ఈడీ జారీ చేసిన 11 షోకాజ్ నోటీసుల్లో 6 అంశాలలో లలిత్ మోదీపై రూ.10.65 కోట్ల భారీ జరిమానా విధించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఆరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, లలిత్ మోదీని ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా, దక్షిణాఫ్రికాలో టోర్నీని విజయవంతంగా నడిపించిన ముఖ్య రూపశిల్పిగా అభివర్ణించింది. క్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు మార్చడం వల్లనే ఐపీఎల్ నిలబడటమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ప్రాపర్టీగా మారిందని లలిత్ గుర్తుచేసుకున్నారు. 

అయితే, లలిత్ మోదీపై ఇంకా పలు మనీలాండరింగ్, అవినీతి ఆరోపణల కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2010లో దేశం విడిచివెళ్లినప్పటి నుంచి లండన్‌లోనే తలదాచుకుంటున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి విచారించాలని ఈడీ, సీబీఐ లాంటి భారతీయ దర్యాప్తు సంస్థలు ఎన్నో ఏళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కానీ ఆ చట్టపరమైన ప్రయత్నాలు ఏవీ ఇప్పటివరకు సఫలం కాలేదు.