ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన రామాలయం ఎక్కడ ఉంది అంటారా? అమితాసక్తి గొలుపుతున్న ఈ అయోధ్య రామాలయాన్ని చూడాలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దాకా వెళితే సరిపోతుంది.

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో అయోధ్య రామాలాన్ని పోలిన రామాలయం సెట్ ఏర్పాటు అవుతోంది. ఈ శ్రీ రామ నవమి సందర్భంగా ఈ ఆలయంలో రామెులోరి విగ్రహాన్ని అయోధ్య నుంచి వస్తున్న పూజారులే ప్రతిష్టించనున్నారు. ఈ అయోధ్య రామాలయ సెట్ ను ఓ ముస్లిం వ్యక్తి ఏర్పాటు చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

పెద్దపల్లికి చెందిన ముక్తియార్ బాష కర్ణాటక రాజధాని బెంగళూరులో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏటా గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు తప్పనిసరిగా హాజరయ్యే బాష వేడుకలు ముగిసేదాకా గ్రామంలోనే ఉంటారట. ఈ ఏడాది కూడా నవమి వేడుకల నిర్వహణకు సంబంధించి గ్రామస్తులు బాషతో సమావేశమ్యారట.

ఈ సందర్భంగా అయోధ్యలోని రాములోరిని దర్శించుకోవడం అంత సులువేమీ కాదని, తమకు ఆ అవకాశం దక్కదని ఒకింత ఆవేదనకు గురయ్యారట. ఈ ఆవేదన బాషలో ఓ కొత్త ఆటోచనకు శ్రీకారం చుట్టేలా చేసిందట. గ్రామంలోనే ఈ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని రామాలయాన్ని పోలిన సెట్ ను ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా అని బాష ఆలోచించారట. అనుకున్నదే తడవుగా అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పిన ఆయన ఆలయ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నవమి సందర్భంగా ఈ సెట్టింగ్ ఆలయంలో రాములోరి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏకంగా అయోధ్య నుంచే పూజారులు వస్తున్నారు. నవమి సందర్బంగా ప్రతిస్ఠించే ఈ విగ్రహం, రాములోరి దర్శనం తదితరాలపై ప్రస్తుతం పెద్దపల్లిలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అయినా ఓ ముస్తిం వ్యక్తి హిందువుల కోరిక తీర్చేందుకు పడుతున్న తపన అమితాసక్తి రేపుతోంది. ఈ ఆలయ సెట్ ను ముంబై నుంచి తెప్పించిన బాష… ఆలయ సెట్టింగ్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైపోయారు. తమ గ్రామంలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని, అన్ని వర్గాల వారిని బంధువులుగానే చూస్తానని చెబుతున్న బాష… తమ గ్రామంలోని హిందువుల అయోధ్య దర్శనం కలను తీర్చేందుకే ఈ ఆయల సెట్టింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.