భారత్ లో జనవరి 26వ తేదీన జరగబోయే రిపబ్లిక్ దినోత్సవ వేడుకులకు ముఖ్యఅతిధి హాజరవ్వటం అనుమానమేనా ? అవుననే అంటోంది బ్రిటన్ తో పాటు మన మీడియా కూడా. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం ఒక్కో దేశాధినేతను పిలవటం మనకు ఆనవాయితీగా వస్తోంది. అందుకనే వచ్చే జనవరి 26 వేడుకలకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపుకు బోరిస్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే తాజాగా బ్రిటన్లో మొదలైన స్ట్రెయిన్ కరోనా వైరస్ కలకలం కారణంగా బోరిస్ రాక అనుమానమే అంటోంది మీడియా. ఎందుకంటే రూపాంతరం చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్ తీవ్రత బ్రిటన్ లో చాలా ఎక్కువగా ఉంది. అందుకనే దేశం మొత్తం మీద ప్రభుత్వం లాక్ డౌనన్ ప్రకటించేసింది. రోజురోజుకు బ్రిటన్లో తీవ్రత పెరిగిపోతోంది.
ఈ కారణంగానే బ్రిటన్ కు ఇతర దేశాల మధ్య ట్రావెల్ బ్యాన్ మొదలైపోయింది. దాదాపు 20 దేశాలు బ్రిటన్ నుండి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. బ్యాన్ విధించిన దేశాల్లో మనదేశం కూడా ఉంది. ఈ ట్రావెల్ బ్యాన్ ఎన్నిరోజులుంటుందో ఎవరు చెప్పలేకున్నారు. పైగా బ్రిటన్ నుండి ప్రయాణీకులు ఇతర దేశాలకు వెళుతున్నారన్నా, వస్తున్నారన్నా ఆయా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి.
ఇందులో భాగంగానే బ్రిటన్ నుండి సోమవారం రాత్రి ఇండియాకు చేరుకున్న చివరి విమానంలో వచ్చిన ప్రయాణీకుల్లో 25 మంది అనుమానిత స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకిందనే టెన్షన్ కేంద్రప్రభుత్వంలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ 25 మంది అబ్సర్వేషన్లో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా బ్రిటన్ ప్రధానమంత్రి రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో హాజరయ్యేది అనుమానంలో పడిందట.
బోరిస్ ఇండియాకు రావాలంటే ప్రత్యేక విమానాంలో వచ్చే అవకాశం ఉంది. అయితే తమ దేశంలో పరిస్ధితులు బావోలేనపుడు ప్రధానమంత్రి మరోదేశంలో జరిగే ఉత్సవాలకు హాజరవ్వటం బాగుండదని బ్రిటన్ లో ప్రచారం మొదలైందట. బ్రిటన్ దేశస్తుల మనోభావాలను కించపరిచినట్లుగా ఉంటుందన్న కారణంతోనే మనదేశంలో జరిగే వేడుకలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని బ్రిటన్ మీడియా చెప్పినట్లు మన మీడియా చెబుతోంది. మరి జనవరి 26 వేడుకలంటే ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి అప్పటికి ఏమవుతుందో చూడాల్సిందే.