సురేష్ రైనా అరెస్టు


భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య క్రికెటేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. యూఏఈలో ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను వ్యక్తిగత కారణాలు చెప్పి అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇప్పుడు అతను ఒక క్లబ్బులో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సోమవారం రాత్రి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానె ఖాన్, సింగర్ గురు రందవా లాంటి ప్రముఖులూ ఉన్నారు. బ్రిటన్ సహా చాలా ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియాలో మళ్లీ వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో ఆంక్షలు పెట్టారు.

ఐతే నిబంధనలకు విరుద్ధంగా ముంబయిలోని క్లబ్బులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నగర వ్యాప్తంగా రైడ్స్ చేశారు. డ్రాగన్ ఫ్లై అనే క్లబ్బులో రైనా, సుసానె, గురు సహా చాలామంది ప్రముఖులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేసుకుంటుండటంతో ఆ క్లబ్‌ను సీజ్ చేసి మొత్తం 35 మందిని అరెస్టు చేశారు. అందులో సెలబ్రెటీలకు తోడు క్లబ్ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐతే రైనా, సుసానె, గురు తదితరులను కాసేపటికే బెయిల్ మీద విడుదల చేశారు.

రైనాకు పార్టీలంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లో నివాసముండే రైనా.. ఇలా ముంబయికి వచ్చి సుసానె తదితరులతో పార్టీ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రైనా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడికి భారత జట్టులో చోటు పోయి చాలా కాలమైంది. దేశవాళీల్లో కూడా పెద్దగా ఆడట్లేదు. కరోనా విరామం తర్వాత ఐపీఎల్ ఆడదామనుకుంటే అనూహ్యంగా దాన్నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయాల్సి వచ్చింది. త్వరలోనే అతను ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో యూపీ తరఫున ఆడే అవకాశాలున్నాయి.