ఫైజ‌ర్ టీకా తీసుకున్నాక ఆమెకేమైంది?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌లైపోయింది. అన్ని చోట్లా ముందు క‌రోనాపై పోరులో కీల‌కంగా ఉన్న వైద్య, పారిశుద్ధ్య‌, ఇత‌ర సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్ర‌ఖ్యాత అమెరిక‌న్ ఫార్మాసూటిక‌ల్ కంపెనీ ఫైజ‌ర్ త‌యారు చేసిన వ్యాక్సిన్ ప‌నితీరు చాలా బాగున్న‌ట్లుగా అధ్య‌య‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

యుఎస్‌లో ఈ కంపెనీ వ్యాక్సిన్‌నే ఎక్కువ‌మందికి ఇస్తున్నారు. ఐతే ఆ దేశంలోని టెన్నిస్సీలోని ఓ నర్సు ఫైజర్ టీకా తీసుకున్న వెంటనే కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది. సంబంధిత వీడియో నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/MDavisbot/status/1339782365774790656

స‌ద‌రు న‌ర్సు వీడియో తీస్తుండ‌గా వ్యాక్సిన్ వేసుకుంది. ఆ వీడియో లైవ్ కూడా అయింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న అనంత‌రం ఆమె త‌న అనుభ‌వాన్ని వివరించే ప్ర‌య‌త్నం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పిన ఆమె.. కొన్ని క్ష‌ణాల త‌ర్వాత‌ ఒక్కసారిగా తలపట్టుకుని ‘‘క్షమించండి, అసౌకర్యంగా అనిపిస్తోంది’’ అని చెబుతూనే అలాగే కుప్ప‌కూలిపోయింది. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది.

మీడియా సమావేశాన్ని కవర్ చేస్తున్న కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల మంది షేర్ చేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐతే ఆ న‌ర్సుకు ఏమీ కాలేద‌ని.. ఆమెకు అల‌ర్జిక్ రియాక్ష‌న్ ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. ఎక్కువ ఎమోష‌న్‌కు, ఒత్తిడికి గురైన‌పుడు జ‌రిగే వాసోవ‌గ‌ల్ రియాక్ష‌న్ కార‌ణంగా ఆమె స్పృహ త‌ప్పింద‌ని.. ఆమెకు ఎలాంటి అపాయం లేద‌ని.. త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఐతే నెటిజ‌న్లు మాత్రం ర‌క‌ర‌కాల పుకార్లు జోడించి ఈ వీడియోను షేర్ చేసి వ్యాక్సినేష‌న్ మీద భ‌యాలు పెంచేస్తున్నారు.