భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం… పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా తుపాకులు క‌లిగి ఉన్న జ‌నాభా ఉన్న‌ ద‌క్షిణాది రాష్ట్రాల్లో.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అయితే.. తుపాకుల వినియోగం గ‌త కొన్నాళ్ల వ‌ర‌కు పెద్ద‌గా లేక‌పోయినా.. ఇటీవ‌ల కాలంలో ఇది పెరుగుతుండ‌డం ప్ర‌మాద‌క‌ర సంకేతంగా మారింది.

గ‌త ఏడాది నిజామాబాద్‌లో నాటు తుపాకీల వినియోగం.. ఏకంగా పోలీసుల‌పైనే కాల్పుల ఘ‌ట‌న త‌ర్వాత .. తుపాకుల లైసెన్సుల‌పై స‌మీక్షిస్తామ‌ని హోం శాఖ ప్ర‌క‌టించింది. కానీ, అది జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల్లో తుపాకీ వినియోగం కార‌ణంగా ఇద్ద‌రు మృతి చెందారు. తాజాగా దుండ‌గుల చేతికే లైసెన్సు తుపాకులు అందిన‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం చేరింది. కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

శ‌నివారం(ఈ రోజు) తెల్లవారు తూనే 6-7 గంట‌ల మ‌ధ్య‌.. దుండ‌గులు ఎస్ బీఐ కేంద్ర కార్యాల‌యంపై దాడి చేసి.. 6 ల‌క్ష‌ల రూపాయ‌లు దోచుకుపోయారు. ఓ వ్య‌క్తి ఆ సోమ్మును డిపాజిట్ చేసేందుకు రాగా.. అతినిని వెంబ‌డించిన‌.. దుండ‌గులు వెంబ‌డించి మ‌రీ కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. అనంత‌రం 6 ల‌క్ష‌లూ దోచుకున్నారు. అయితే.. వీరు స‌ద‌రు వ్య‌క్తికి అత్యంత స‌న్నిహితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారే దీనికి సూత్ర‌ధారులుగా భావిస్తున్నారు.

బైకుపై వ‌చ్చిన వారు.. ప‌నిగ‌ట్టుకుని స‌ద‌రు వ్య‌క్తి వ‌ద్ద‌కు వ‌చ్చి బెదిరించి.. తుపాకులు చూపించి.. వెంబ‌డించి.. కాల్పులు కూడా జ‌రిపి సొమ్ము దోచుకున్న వైనంపై పోలీసులు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. తుపాకీ సంస్కృతి విచ్చ‌ల‌విడిగా పెరుగుతున్న నేప‌థ్యానికి ఇది ఉదాహ‌ర‌ణ‌గా ప‌లువురు పేర్కొంటున్నారు. దీనికి అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. తెలంగాణ రైజింగ్ -2047 సాధ‌న‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు అడ్డు ప‌డ‌తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.